శ్రీగిరి కార్మికులు కస్సు‘బస్సు’
శ్రీశైలంటెంపుల్: అసలే అరకొర జీతం.. ఆ జీతంలో కూడా కొంత బస్సు చార్జీలకు వెచ్చించాల్సి రావడంతో శ్రీగిరి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన పద్మావతి హస్పిటాలిటీ, ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఏజెన్సీ తీరుతో శ్రీశైల దేవస్థానంలో పనిచేస్తున్న శానిటేషన్, హౌస్‌కీపింగ్ కార్మికులు కస్సు‘బస్సు’మంటున్నారు. డీజిల్ భారం భరించలేమంటూ సంబంధిత ఏజెన్సీ కార్మికుల ఉచిత బస్సు సర్వీసును నిలిపివేసింది. దీంతో సున్నిపెంట నుంచి ప్రతిరోజు వెళ్లే 100 మందికి పైగా కార్మికులు అవస్థలు పడుతు న్నారు. ప్రైవేట్ వాహనాలను అశ్రయిస్తూ, అదనపు చార్జీలు చెల్లిస్తూ.. ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. అరకొర వచ్చే జీతాల్లో చార్జీలకు అదనంగా చెల్లించాలంటే ఎలా అంటూ కూటమి ప్రభుత్వంపై కార్మికులు మండిపడుతున్నారు. శ్రీశైల దేవస్థానాన్ని నమ్ముకుని సున్నిపెంట గ్రామంలో పలు కుటుంబాలు జీవిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానంలో శానిటేషన్, హౌస్‌కీపింగ్ విభాగంలో పలువురు కార్మికులు పనిచేస్తున్నారు. సున్నిపెంట గ్రామం నుంచి మహిళలు, పురుషులు సుమారు 100 మందికి పైగా ప్రతిరోజు శ్రీశైలం వెళ్లి పనులు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రైవేట్ వాహనాలను అశ్రయిస్తూ శ్రీశైలం వెళ్లే వారు. గతంలో పాలధార–పంచధార వద్ద ప్రైవేట్ జీపు ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కార్మికుల రక్షణే ధ్యేయంగా పూర్తిస్థాయి కండీషన్ ఉన్న వాహనంలో కార్మికులు ప్రతిరోజు వెళ్లి వచ్చేలా ఏర్పా టు చేయాలని ఆలోచించారు. ఈ నేపథ్యంలో దేవస్థానంతో సంప్రదింపులు జరిపి దేవస్థానంచే ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. డీజిల్ నిర్వహణ కోసం కార్మికుల నుంచి రూ.10వసూలు చేశారు. కొన్ని రోజులకు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేయ డం తీసివేశారు. సంబంధిత కార్తికేయ ఏజెన్సీ డీజిల్‌కు అయ్యే ఖర్చు భరించేలా ఏజెన్సీ వారితో చర్చించి వారిని ఒప్పించారు. నెలకు సుమారు రూ.లక్ష డీజిల్‌కు ఖర్చు అయ్యేవి. ఈ ఖర్చు కార్తికేయ ఏజెన్సీ భరించడంతో కార్మికులు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
కార్మికుల అవస్థలు..
పద్మావతి ఏజెన్సీ కార్మికులకు ఉచిత బస్సు సర్వీసు తొలగించడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉచిత బస్సు తొలగించడంతో కొందరు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడంతో వారు ఘాట్‌రోడ్డులో స్టాండింగ్ లేదని బస్సు ఎక్కించుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాలను అశ్రయిస్తు అధిక చార్జీలతో తమ జేబులకు చిల్లులు చేసుకుంటున్నారు. సమయానికి వెళితేనే ప్రేవేట్ వాహనాలు, లేకపోతే ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ వాహనాల్లో అధిక చార్జీలు చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న దేవస్థానం అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసు కుని పద్మావతి ఏజెన్సీతో సంప్రదించి గతంలో మాదిరిగానే కార్మికులకు ఉచిత బస్సు సర్వీసును కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
డీజీల్ భారం భరించలేమంటూ..
గతంలో ఉచిత బస్సు రోజుకు ఆరు సార్లు సర్వీసు నడిపేవారు. ఒకసారి శానిటేషన్ సిబ్బంది, మరోసారి హౌస్‌కీపింగ్ సిబ్బంది ఇలా డ్యూటీ దిగే వారిని, డ్యూటికి వెళ్లే వారిని సమయానుకూలంగా తీసుకెళ్లేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో సెంట్రలైజేషన్ టెండరింగ్ పేరుతో ఏడు ఆలయాలకు కలిపి ఒకే టెండర్‌ను నిర్వహించారు. పద్మావతి హస్పిటాలిటీ, ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఏజెన్సీ ఈ టెండర్‌ను దక్కించుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి పద్మావతి ఏజెన్సీ శానిటేషన్, హౌస్‌కీపింగ్, ఇతర మెంటెనెన్స్ పనులు నిర్వహిస్తోంది. అయితే నవంబరు 1వ తేదీ నుంచి సున్నిపెంట నుంచి వచ్చే కార్మికుల ఉచిత బస్సు సర్వీసుకు పద్మావతి ఏజెన్సీ డీజిల్ చార్జీలు ‘మేము భరించలేం’ అని చెప్పడంతో ఉచిత బస్సు సర్వీసును నిలిపివేశారు.
శ్రీశైల దేవస్థానం కార్మికుల
ఉచిత బస్సు సర్వీసుకు మంగళం
శానిటేషన్, హౌస్‌కీపింగ్ వర్కర్స్
అవస్థలు
సున్నిపెంట నుంచి 100 మందికి పైగా
కార్మికులు
ప్రైవేట్ వాహనాల్లో అదనపు చార్జీలతో
కార్మికుల జేబులకు చిల్లు


