ధర నిర్ణయించే స్థాయికి రైతు ఎదగాలి
● ప్రకృతి సేద్యంలో రాణించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంటలకు ధర నిర్ణయించే స్థాయికి రైతులు ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌లో డీపీఎంయూ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ–ఐసీఆర్‌పీ ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఒక లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రస్తు తం 50 వేల మంది రైతులు మాత్రమే పాక్షికంగా ప్రకతి వ్యవసాయం చేస్తుండగా, పూర్తి స్థాయిలో సాగు చేస్తున్న రైతులు 6వేల మంది ఉన్నారని వివరించారు. ప్రకృతి వ్యవసాయం విస్తరణలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఇంటి వద్ద కిచెన్ గార్డెన్లు, అంగన్‌వాడీ సెంటర్లు, పాఠశాలల్లో పెరటి తోటలు ఏర్పాటు చేసి, భావితరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని టీ–ఐసీఆర్‌పీలకు కలెక్టర్ సూచించారు. పురుగు, తెగుళ్ల నివారణకు రసాయనాల బదులు కషాయాలు వాడాలని, యూరియా – డీఏపీ వాడకాన్ని తగ్గించాలన్నారు. అలాగే గట్లపై చెట్లను నాటి పర్యావరణ సమతుల్యం కాపాడాలని పేర్కొన్నారు. 365 రోజుల పాటు పంట వైద్యాన్ని పాటించడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరి చేత సాధ్యమేనన్నారు. రైతు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎంసీ మద్దిలేటి, డీపీఎం శ్రీనివాసులు, ఏడీపీఎం అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.


