
మాండ్ర మెప్పునకు సీఐ పాట్లు
● సామాజిక మాధ్యమాల్లో
టీడీపీ పాంప్లెట్ పోస్టు చేసిన సీఐ
సాక్షి, నంద్యాల: అధికార పార్టీ నాయకుల ఆశీస్సుల కోసం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. వారి మెప్పు పొందేందుకు హోదాను మరిచి దిగజారుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పది రోజుల క్రితం రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒక వర్గంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై ఎమ్మెల్యే గిత్త జయసూర్య తీవ్ర ఒత్తిడి చేశారు. ఒకానొక దశలో టౌన్ సీఐపై నోరు పారేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో తన పోస్టింగ్‌ను కాపాడుకునేందుకు టౌన్ సీఐ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మాండ్ర శివానందరెడ్డి మెప్పు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ‘‘ఇదీ మన కుటుంబం.. ఇదీ మన తెలుగు దేశం కుటుంబం.. కలిసి పని చేద్దాం.. కలిసి ముందుకు సాగుదాం..’’ అనే పాంప్లెట్‌ను మాండ్ర ఫొటోతో కలిపి కొన్ని వాట్సాప్ గ్రూప్‌లలో స్వయంగా టౌన్ సీఐ పోస్టు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో ఉన్నారనేందుకు ఈ పోస్టు తాజా ఉదాహరణ.