లడ్డూ మాటున దోపిడీ
జూపాడుబంగ్లా: తర్తూరు జాతరలో స్వామివారి ప్రసాదంగా భక్తులు అందించే లడ్డూలో విక్రయదారుడు చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. ఈనెల ఒకటోవ తేదీన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి సమక్షంలో టెంకాయలు, లడ్డూలు, కొబ్బరి చిప్పల వేలాలు నిర్వహించారు. ఈ వేలాల్లో కొణిదేల గ్రామానికి చెందిన రంగస్వామి రూ.1,05,000లకు స్వామివారి ప్రసాదంగా లడ్డూల విక్రయాన్ని దక్కించుకున్నారు. 70గ్రాముల బరువుతో నాణ్యతగా ఉండే ఒక లడ్డూ రూ.15ల చొప్పన విక్రయించాలని, అధిక ధరలకు లడ్డూ విక్రయించినా, నాణ్యతలేకపోయినా వేలం పాటను రద్దుచేస్తామని అధికారులు హెచ్చరించారు. వేలం పాటదారుడు మూడు లడ్డూలను ప్యాక్‌గా చేసి రూ.50 చొప్పున విక్రయిస్తూ అప్పనంగా రూ.5 భక్తుల నుంచి నొక్కేస్తున్నారు. తక్కువ బరువు, నాణ్యత లేని లడ్డూలను విక్రయిస్తున్నాడని, అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


