సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే
నంద్యాల(అర్బన్): సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. బొమ్మలసత్రం సమీపంలో సమీకృత ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు చదువుకుంటే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన సతీమణి సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది జ్యోతిరావు పూలే అన్నారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ.. కుల, మత, వర్గ విభేదాలు లేని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ల ద్వారా 514 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకం కింద రూ.12.37 కోట్ల మెగా చెక్కును అందజేశారు. అనంతరం సమీకృత ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో మరమ్మతులు చేసిన టాయిలెట్స్‌ను మంత్రి, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. యాదవ, కురవ కార్పొరేషన్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, రామకృష్ణ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఓబులేసు, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్, పలు సంఘాల నాయకులు నాగ శేషుయాదవ్, గోవిందనాయుడు, గుర్రం లక్ష్మి, గౌరి, బోయ రామకృష్ణ పాల్గొన్నారు.


