40 ఏళ్లుగా పార్టీకి సేవ చేశా.. కేఈ ప్రభాకర్‌ ఆవేదన | - | Sakshi
Sakshi News home page

40 ఏళ్లుగా పార్టీకి సేవ చేశా.. కేఈ ప్రభాకర్‌ ఆవేదన

Nov 26 2023 2:16 AM | Updated on Nov 27 2023 1:54 PM

- - Sakshi

నంద్యాల: ఇప్పటికే ప్రజాదరణ లేని తెలుగు దేశం పార్టీలో నాయకుల మధ్య అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకుంటోంది. ఇటీవల వరుస సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 40 ఏళ్లుగా పార్టీకి సేవలు చేసిన తమను సంప్రదించకుండానే డోన్‌ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించడం పెద్ద తప్పిదమని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ ఇటీవల తన జన్మదిన వేడుకల్లో అధినేత చంద్రబాబును తీరును తప్పుబట్టారు. దీంతో కేఈ ప్రకటన ఇచ్చిన మరునాడే నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ డోన్‌కు వచ్చి టీడీపీ ఇన్‌చార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డే కొనసాగుతారని, అది పార్టీ నిర్ణయమని తేల్చిచెప్పారు.

ఈ విషయంలో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు చేయాలే తప్పా పత్రికలకు ఎక్కరాదని ఆయన పరోక్షంగా కేఈ ప్రభాకర్‌తో పాటు ఆయన వర్గీయులను తీవ్రంగా హెచ్చరించారు. మల్లెల రాజశేఖర్‌తో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన వారిపై సోషల్‌మీడియాలో కేఈ వర్గీయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా వారి గ్రామాల్లో సర్పంచుగా గెలవలేని దద్దమ్మలని దుమ్మెత్తిపోశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వీరిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని కేఈ వర్గీయులు ఘాటు విమర్శలు చేశారు.

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి ఇక్కడ ఇన్‌చార్జ్‌ను నియమించారని గుమ్మకొండ సర్పంచ్‌ దశరథ రామిరెడ్డి ఆరోపించారు. ఏ ఒక్కరితో సంప్రదించకుండా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని ఎలా నియమిస్తారని చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌పై కూడా కేఈ వర్గీయులు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. మరోసారి మల్లెల రాజశేఖర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించడానికి డోన్‌కు వస్తే అడుగు పెట్టనివ్వమని కేఈ వర్గీయులు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement