breaking news
ke prabhaka
-
40 ఏళ్లుగా పార్టీకి సేవ చేశా.. కేఈ ప్రభాకర్ ఆవేదన
నంద్యాల: ఇప్పటికే ప్రజాదరణ లేని తెలుగు దేశం పార్టీలో నాయకుల మధ్య అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకుంటోంది. ఇటీవల వరుస సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 40 ఏళ్లుగా పార్టీకి సేవలు చేసిన తమను సంప్రదించకుండానే డోన్ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రకటించడం పెద్ద తప్పిదమని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఇటీవల తన జన్మదిన వేడుకల్లో అధినేత చంద్రబాబును తీరును తప్పుబట్టారు. దీంతో కేఈ ప్రకటన ఇచ్చిన మరునాడే నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డోన్‌కు వచ్చి టీడీపీ ఇన్చార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డే కొనసాగుతారని, అది పార్టీ నిర్ణయమని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు చేయాలే తప్పా పత్రికలకు ఎక్కరాదని ఆయన పరోక్షంగా కేఈ ప్రభాకర్‌తో పాటు ఆయన వర్గీయులను తీవ్రంగా హెచ్చరించారు. మల్లెల రాజశేఖర్‌తో ప్రెస్‌మీట్ నిర్వహించిన వారిపై సోషల్‌మీడియాలో కేఈ వర్గీయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా వారి గ్రామాల్లో సర్పంచుగా గెలవలేని దద్దమ్మలని దుమ్మెత్తిపోశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వీరిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని కేఈ వర్గీయులు ఘాటు విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి ఇక్కడ ఇన్‌చార్జ్‌ను నియమించారని గుమ్మకొండ సర్పంచ్ దశరథ రామిరెడ్డి ఆరోపించారు. ఏ ఒక్కరితో సంప్రదించకుండా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ధర్మవరం సుబ్బారెడ్డిని ఎలా నియమిస్తారని చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌పై కూడా కేఈ వర్గీయులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. మరోసారి మల్లెల రాజశేఖర్ ప్రెస్‌మీట్ నిర్వహించడానికి డోన్‌కు వస్తే అడుగు పెట్టనివ్వమని కేఈ వర్గీయులు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. -
అభ్యర్థులు కావలెను!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధినేత రెండు కళ్ల సిద్ధాంతం.. స్థానికంగా వెన్నుపోటు రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఉనికి కోల్పోతోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన పార్టీ నేడు మిణుకుమిణుకుమంటోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో ఇప్పటికీ స్పష్టత కరువైంది. ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న వారికి సీటు వస్తుందో రాదో తెలియని సందిగ్ధం నెలకొంది. అధిక శాతం అభ్యర్థులు సైతం పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఫరూక్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన అసెంబ్లీ నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఎంపిక విషయమై స్వయంగా పార్టీ అధినేత రంగంలోకి దిగినా ఫలితం లేకపోయిందనే చర్చ జరుగుతోంది. కొందరు కాంగ్రెస్ నాయకులను సంప్రదించినా వారు ముందుకు రాలేదని సమాచారం. పోటీకి సుముఖంగా లేమని కొందరు ముఖం మీదే చెప్పినా.. ఇంకొందరు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని దాటవేసినట్లు తెలిసింది. అభ్యర్థి వేటలో ఆ పార్టీ శ్రేణులు తొక్కని గడప లేదంటే అతిశయోక్తి కాదు. కర్నూలు పార్లమెంట్ స్థానం విషయానికొస్తే పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ పేరు ప్రచారంలో ఉంది. మొదట డోన్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చినా.. ఆయన డోన్ నుంచే పోటీ చేస్తానని పత్రికా ముఖంగా ప్రకటించారు. అయితే ఇక్కడా అభ్యర్థి విషయంలో స్పష్టత కరువైంది. ఇకపోతే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. కర్నూలు, నందికొట్కూరు, ఆలూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత ఇన్చార్జీలు కేవలం పార్టీ కార్యక్రమాల నిర్వహణకే పరిమితమని.. వారే అభ్యర్థులని చెప్పలేమని ఓ ముఖ్య నాయకుడు తెలిపారు. అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లోనూ ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో ప్రజలతో కలిసి నడవకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలనే ప్రశ్న ఆ పార్టీ నాయకులను వేధిస్తోంది. ఇదిలాఉంటే కర్నూలు టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డిని బయటకు వెళ్లగొట్టిన నాయకులే ప్రస్తుతం మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరికి పొగ పెడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చౌదరి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు ద్వారా పార్టీ తీర్థం పుచ్చుకోవడాన్ని కొందరు జిల్లా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ప్రాబల్యాన్ని తగ్గించే చర్యలు తెర వెనుక ముమ్మరమైనట్లు తెలుస్తోంది. వెన్నుపోటు రాజకీయాలతో పా ర్టీ దిగజారుతుండటం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది.