● చౌటుప్పల్ మండలం తంగడపల్లి రెవెన్యూ పరిధిలో 80.11 ఎకరాలు.
● సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురంలో 9.30 ఎకరాలు, కోతులాపురంలో 22.22, చిమిర్యాలలో 25.12, సర్వేల్‌లో 139.29, కంకణాలగూడెంలో 25.23, పుట్టపాకలో 84.20 ఎకరాలు.
● గట్టుప్పల్ మండలంలో గట్టుప్పల్‌లో 83.35 ఎకరాలు, తేరట్‌పల్లిలో 83.13, వెల్మకన్నెలో 1.37 ఎకరాలు.
● చింతపల్లి మండలం కుర్మపల్లిలో 93.06 ఎకరాలు, మల్లేపల్లిలో 43.13, వింజమూర్‌లో 80.08, కుర్మేడులో 1.37 ఎకరాలు.
● మర్రిగూడ మండలం వట్టిపల్లిలో 107.07 ఎకరాలు, బట్లపల్లిలో 2.23, దామరభీమనపల్లిలో 93.01, మర్రిగూడలో 48.31, మేటిచందాపూర్‌లో 78.28, నామాపూర్‌లో 80.21, సరంపేట గ్రామంలో 21.11 ఎకరాలు.
చౌటుప్పల్, మర్రిగూడ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)విస్తరణలో మరో మైలురాయి పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకర కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా తాజాగా దక్షిణ భాగానికి సైతం బీజం పడింది. దక్షిణ భాగం ఉమ్మడి జిల్లాకు సంబంధించి నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా వెళ్తుంది. నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, మునుగోడు, మర్రిగూడ, చింతపల్లి మండలాల పరిధిలో 33.16 కిలోమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో 15.66 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. అయితే చౌటుప్పల్ పట్టణంలోని జంక్షన్ ప్రాంతం నుంచి మొదలయ్యే దక్షిణ భాగానికి మండలంలోని తంగడపల్లి, నారాయణపురం మండలంలో చిమిర్యాల, గుడ్డిమల్కాపురం, కంకణాలగూడెం, కోతులాపురం, పుట్టపాక, సర్వేల్ గ్రామాల పరిధిలో 387.30ఎకరాల భూమిని సేకరించనున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు మండలంలోని వెల్మకన్నె, గట్టుప్పల్ మండలంలోని తేరట్‌పల్లి, గట్టుప్పల్, చింతపల్లి మండలంలోని కుర్మేడు, కుర్మపల్లి, మల్లేపల్లి, వింజమూరు, మర్రిగూడ మండలంలోని బట్లపల్లి, దామెరభీమనపల్లి, మర్రిగూడ, సరంపేట, మేటిచందాపూర్, నామాపూర్, వట్టిపల్లి గ్రామాల పరిధిలో 818.36ఎకరాలు సేకరించాల్సి ఉంది.
భూ సేకరణ అధికారులుగా ఆర్డీఓలు
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ నోటిఫికేషన్లు శనివారం ఆయా జిల్లాల్లో విడుదల అయ్యాయి. ఇందుకుగాను చౌటుప్పల్, చండూరు, దేవరకొండ ఆర్డీఓలను భూసేకరణ అఽధికారులుగా నియమించారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే మొదలుపెట్టారు.
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి భూ సేకరణ నోటిఫికేషన్
నల్లగొండ జిల్లా పరిధిలో
33.16 కిలోమీటర్ల రోడ్డు
యాదాద్రి జిల్లాలో 15.66 కిలోమీటర్లు..


