నల్లగొండ అగ్రికల్చర్ : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా జరిగిన పంటల నష్టంపై అంచనాలు వేయడానికి ఈ నెల 30న జిల్లాలో ఐదురుగు సభ్యులతో కూడిన కేంద్ర కరువు బృందం పర్యటించనుంది. జిల్లాలో ఇప్పటి వరకు 621 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా కేవలం 357.2 మి.మీ. వర్షం కురిసింది. దీంతో జిల్లా అంతటా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటి పంటలకు తీరని నష్టం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఏఈఓలు నెల రోజులుగా సర్వే నిర్వహిస్తూ ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో 33 శాతంకుపైగా నష్టం జరిగిన వివరాలను నమోదు చేశారు. జిల్లా అంతటా దాదాపు పంట నష్టం సర్వేను పూర్తి చేసినప్పటికీ దానిపై జిల్లా యంత్రాంగం పైనల్ చేయనుంది.
క్షేత్రస్థాయిలో పరిశీలన
సోమవారం ఐఏఎస్ అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం జిల్లాలో పర్యటించి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిన పరిస్థితి, కరువు కారణంగా కూలీలకు కల్పిస్తున్న ఉపాధి హామి పనులు, చెరువులు, కుంటల పరిస్థితులు జిల్లాలో తాగునీటి పరిస్థితి, నీటి తొట్లు, పశువులు, పశుగ్రాసం పరిస్థితి అంచనా వేయనున్నారు. ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో దెబ్బతిన్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లాలోని మునుగోడు, దేవరకొండ వ్యవసాయ డివిజన్లలో ఈ కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర బృందం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు, కరువుపై పూర్తి నివేదికను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది.
ఫ 30న మునుగోడు, దేవరకొండ వ్యవసాయ డివిజన్లలో పర్యటన


