రామగిరి (నల్లగొండ): రైతాంగానికి ఆధునిక సాగు పద్ధతులు, శాసీ్త్రయ పరిజ్ఞానం, నూతన సాంకేతికతను చేరువ చేసే లక్ష్యంతో నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ఈ నెల 14, 15, 16 తేదీల్లో భారీ అగ్రి షో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ అగ్రి షోను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ అగ్రి షోలో మొత్తం 125 స్టాళ్లు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యవసాయ డ్రోన్లు, ఆధునిక ట్రాక్టర్లు, పనిముట్లు, నూతన వంగడాలు, ఎరువులు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) నిపుణులు నేరుగా పాల్గొని పంటల సాగు, చీడపీడల నివారణపై రైతుల సందేహాలను నివృత్తి చేస్తారని చెప్పారు. నీటి కొరతను అధిగమించేలా డ్రిప్, స్ప్రింక్లర్లు, జెట్ వంటి సూక్ష్మ సాగునీటి సాంకేతికతను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. పామాయిల్ పంటకు నీటి యాజమాన్య పద్ధతులను వివరించేందుకు పామాయిల్ కంపెనీలు, పతంజలి సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు రుణ సదుపాయాల అవగాహన కోసం సీసీ బ్యాంకు స్టాల్, నర్సరీలు, హెర్బల్, ఆయుర్వేద ఉత్పత్తుల స్టాళ్లు కొలువుదీరనున్నాయని పేర్కొన్నారు. నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలు, 41వ సర్వసభ్య సమావేశంలో భాగంగా అగ్రి షో ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతీయ మహాసభలకు దేశంలోని 29 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు నల్లగొండకు తరలిరానున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా రైతులు అగ్రి షోను సందర్శించి, వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నేతలు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, ఎండీ హషం, పాలడుగు నాగార్జున, రామునాయక్, ఎండీ. సలీం, వెంకట్‌రెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, నలపరాజు సైదులు, కొండ వెంకన్న, పి. సత్యనారాయణ, వి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నంద్యాల నరసింహారెడ్డి


