నల్లగొండ అగ్రికల్చర్ : గేదెలు, ఆవు దూడలను సరిగ్గా సంరక్షిస్తేనే పశు సంపద వృద్ధి చెందుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్, పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి. సుబ్బారాయుడు అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని పానగల్‌లో మేలు జాతి గేదెలు, ఆవు దూడల ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులందరూ తమ పశువులకు లింగ నిర్ధారిత వీర్యాన్ని వినియోగించి కృత్రిమ గర్భధారణ చేయించడం ద్వారా అధిక సంఖ్యలో ఆడ దూడలను పొందాలని సూచించారు. దూడలు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని, క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించాలన్నారు. దూడల ఎదుగుదలకు అవసరమైన కాల్షియం టానిక్‌లను అందించాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు జీవీ.రమేష్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు తమ పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని విరివిగా సాగు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రదర్శనలో 50 ముర్రా జాతి గేదె దూడలు, 10 మేలు జాతి ఆవు దూడలను ప్రదర్శించారు. ప్రదర్శనలో పాల్గొన్న అన్ని దూడలకు నట్టల నివారణ మందులు, బలవర్ధక కాల్షియం టానిక్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగరాజు, సహాయ సంచాలకులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, గోపాలమిత్రలు తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ
అదనపు డైరెక్టర్ సుబ్బారాయుడు


