పత్తి రైతుకు చినుకు చింత | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు చినుకు చింత

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

వారంలో వర్షాలు కురవకపోతే పత్తిచేలకు నష్టమే..

నల్లగొండ అగ్రికల్చర్‌ : పత్తి రైతులపై నైరుతి రుతుపవనాలు కరుణించడంలేదు. ఎలినినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నేటి వరకు చిరుజల్లులు తప్ప ఏ ఒక్క రోజు భారీ వర్షం కురిసింది లేదు.. వరదలు పారింది లేదు. జూన్‌ మాసంలో కురిసిన చిరుజల్లుల కారణంగా జిల్లా వ్యాప్తంగా రైతులు 6లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఆ వర్షాలతో మొలకెత్తిన పత్తిచేలకు నేటి వరకు ఎక్కడ కూడా అనుకూలమైన వర్షాలు కరువలేదు. ప్రస్తుతం జిల్లా అంతటా పత్తిచేలు పూత, పిందె దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు రైతులు కొన్నిచోట్ల చేలకు గుంటుకలు తోలి ఎరువులు పెట్టుకున్నారు. వర్షాలులేని కారణంగా చేలు వాడుపట్టి, పూత, పిందెలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఉన్న పిందెలు కూడా ఎదుగుదల లోపించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరం

పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టి పత్తిపంట సాగు చేసిన రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఎకరానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడులను పెట్టి పత్తిని సాగు చేసిన రైతులకు వరుణుడు కరుణించని కారణంగా అప్పుల పాలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఎకరాకు రెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉండదని వ్యవసాయశాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఈ వారంలో ఏమైనా వర్షాలు వస్తే తప్ప పత్తిచేలు చేతికొచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో లోటు వర్షపాతమే...

జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో నేటి వరకు 323.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 230 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. జిల్లా అంతటా జూలై, ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున వర్షాలు కురవాల్సి ఉండగా కేవలం ఆకాశంలో మబ్బులు తప్ప ఎక్కడ పెద్దవర్షం కురిసిన దాఖలాలు లేవు. జిల్లాలో 11 మండలాల్లో ఇప్పటి వరకు సాధారణ వర్షం కురవగా కేతేపల్లి మండలంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నార్కట్‌పల్లి, కట్టంగూర్‌, శాలిగౌరారం, నకిరేకల్‌, తిప్పర్తి, నల్లగొండ, అనుముల హాలియా, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి, మిర్యాలగూడ, తిరుమలగిరి సాగర్‌, పెద్దవూర, గుర్రంపోడు, పీఏపల్లి, నేరడుగొమ్ము, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, చండూరు, గట్టుప్పల్‌ మండలాల్లో లోటు వర్షం కురిసింది. దీంతో జిల్లా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పత్తిచేలు ఎండే పరిస్థితి నెలకొంది.

వర్షపాతం నమోదు వివరాలు (మిల్లీమీటర్లలో..)

నెల సాధారణం గతేడాది ప్రస్తుతం లోటు

జూలై 113.8 129.7 54.7 –51.9

ఆగస్టు 136.8 257.0 49.5 –60.2

ప్రస్తుతం జిల్లా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పత్తిచేలు వాడుబడుతున్నాయి. వారంలో వర్షాలు కురిస్తే తప్ప పత్తిచేలు బతికే అవకాశం లేదు. వర్షాలు కురవకపోతే పత్తికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది.

– ఉల్లోజు వినోద్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

ఎండుతున్న ఆశలు!

ఫ వానలు లేక ఎదుగుదల

లోపించిన పత్తిచేలు

ఫ తీవ్ర వర్షాభావ పరిస్థితులే కారణం

ఫ వరుణుడి కరుణ కోసం

కర్షకుల ఎదురుచూపులు

ఫ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల

ఎకరాల్లో పత్తిసాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement