నేడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సాధారణ సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సాధారణ సమావేశం

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సాధారణ సమావేశం ఈ నెల 31న కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ వంశీకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేషన్‌ మేయర్‌ బుర్రి చైతన్య అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కమిషనర్‌ కోరారు.

ఆన్‌లైన్‌ ఎంట్రీ

సకాలంలో పూర్తిచేయాలి

కనగల్‌ : గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2026–27కు సంబంధించిన ఆన్‌లైన్‌ ఎంట్రీ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) తరుణ్‌ చక్రవర్తి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కనగల్‌ ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి, జీపీడీపీ ఆన్‌లైన్‌ ఎంట్రీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీఓ సతీష్‌ కుమార్‌ను అడిగి పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దు

నల్లగొండ టౌన్‌ : సాంకేతిక కారణాల పేరుతో ఓటర్లను ఇబ్బంది పెట్టవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఒక ప్రకటనలో అధికారులు కోరారు. సర్‌ ప్రక్రియ సందర్భంగా జిల్లాలో సుమారు 2,64,000 మందికి నోటీసులు అందజేసినట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోందన్నారు. మ్యాపింగ్‌ అయిన వారికి కూడా లాజికల్‌, డెమోగ్రాఫిక్‌, క్లరికల్‌ (అక్షర) దోషాలు ఉన్నాయనే నెపంతో ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో సుమారు 100 నుంచి 200 మందికి నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ తప్పులన్నీ 2002 నాటి ఓటర్ల జాబితా నుంచి దొర్లినవేనని పేర్కొన్నారు. విచారణ పేరుతో ఓటర్లను వేధించకుండా, వారు ఏ రకమైన ఆధారాలు సమర్పించినా వెంటనే ఆమోదించి ఓటర్లుగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు.

యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణ వేడుక

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం నిత్య కల్యాణ వేడుకతో పాటు సంప్రదాయ పూజలు కొనసాగాయి. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ సంప్రదాయంగా జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధిలో స్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు.

బుల్లెట్‌ రైలు మొదటి

అలైన్‌మెంట్‌ను మార్చొద్దు

సూర్యాపేట : బుల్లెట్‌ రైలు మొదటి అలైన్‌మెంట్‌ను మార్చొద్దని బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి, అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 17వ రోజు కొనసాగాయి. దీక్షలో అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్యలో ఉన్న సూర్యాపేటకు రైలు మార్గం లేకుండా పోతుందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా కాకుండా పక్కదోవ పట్టిస్తున్న పాలకులపై పోరాటం నిర్వహిస్తామన్నారు. దీక్షలో అంగన్‌వాడీ సిబ్బంది భాస్కరమ్మ, వసంత, ఏకలక్ష్మి, సంతోషకుమారి, వెలుగు వనిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement