ఫ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్
మిర్యాలగూడ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. దామరచర్ల మండలం కొత్తపేటతండాలో లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం గృహ యజమానులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని వేగవంతంగా అమలు చేస్తోందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామాల్లోని ఇళ్లులేని పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు బాలు, శోభన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


