అంచనాలు తప్పిన సాగు | - | Sakshi
Sakshi News home page

అంచనాలు తప్పిన సాగు

Jul 30 2026 5:12 AM | Updated on Jul 30 2026 5:12 AM

ఆరుతడి పంటలే వేసుకోవాలి..

నల్లగొండ అగ్రికల్చర్‌ : వానాకాలం సీజన్‌ ఆరంభమై 50 రోజులు దాటినా జిల్లాలో చెరువులు, కుంటలు నిండే స్థాయిలో వర్షాలు కురవలేదు. కేవలం చిరుజల్లులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముసురుతో కూడిన వానలు మాత్రమే వచ్చాయి. దీంతో వానాకాలం సాగు కష్టతరంగా మారింది. జూన్‌మాసంలో కురుసిన ముసురు వర్షాలకు రైతులు పత్తిగింజలు పెట్టుకున్నారు. అవి మొలకెత్తిన నాటి నుంచి వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి మొక్కలు వాడుపడుతున్నాయి. మరోవైపు గత వానాకాలంలో ఈ నెలాఖరు వరకు 3 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసుకోగా ఈసారి 81,123 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. 13,336 ఎకరాల్లో వరినార్లు పోసుకున్నారు.

6,78,750 ఎకరాల్లోనే పంటలు..

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో వివిధ సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో వరి 5,46,165 ఎకరాల్లో పత్తి 6,47,689 ఎకరాల్లో ఇతర పంటలు కలిపి మొత్తం 12 లక్షల ఎకరాల వరకు సాగవుతాయని లెక్కలు వేసింది. కానీ, వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో కేవలం 81,123 ఎకరాల్లో వరినాట్లు వేసుకోగా పత్తి 5,79,283 ఎకరాల్లో, జొన్న 11, కంది 2224, పెసర 64, వేరుశనగ 7, ఆముదం 12 ఎకరాల్లో సాగు చేశారు. పత్తిని రైతులు అంచనాకు కొంత తక్కువ సాగు చేసినప్పటికీ వర్షాలు లేక ఎదుగుదల తగ్గిపోయింది. వర్షాలు కురిస్తే గుంటకలు తోలి ఎరువులు పెడితే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది.

15 మండలాల్లో లోటు వర్షం..

జిల్లాలో ఇప్పటి వరకు 15 మండలాల్లో లోటు వర్షం కురిసింది. జూలై మాసంలో ఇప్పటి వరకు 109.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 49.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 11 మండలాల్లో సాధారణ వర్షం నమోదవగా.. శాలిగౌరారం, నకిరేకల్‌, తిప్పర్తి, నల్లగొండ, అనుముల హాలియా, నిడమనూరు, మిర్యాలగూడ, తిరుమలగిరి సాగర్‌, పీఏ పల్లి, నేరేడుగొమ్ము, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో లోటు వర్షం కురిసింది. కేతేపల్లి మండలంలో దుర్భిక్ష పరిస్థితి నెలకొనగా చిట్యాల, దామరచర్ల, అడవిదేవులపల్లి, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో అధిక వర్షం కురిసింది. పరిస్థితి ఇలాగే ఉంటే వేసిన పంటలు కూడా చేతికి వస్తాయో రాదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు.

జిల్లాలో ప్రస్తుత సీజన్‌ మొత్తం వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేనందున రైతులు ఆరుతడి మాత్రమే సాగు చేసుకోవాలి. కంది, పెసర, మినుము, నువ్వులు వంటి మెట్ట పంటలను సాగు చేసుకుంటే మంచిది. విత్తనాలు అందబాటులో ఉన్నాయి.

– వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

ఫ ఎల్‌నినోతో జిల్లాలో

వర్షాభావ పరిస్థితులు

ఫ 15 మండలాల్లో లోటు వర్షం

ఫ వాడిపోతున్న పత్తి చేలు..

90 వేల ఎకరాలు దాటని వరి నాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement