అధికారులకు భారీగా ముడుపులు!
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గిరికబావిగూడెం వద్ద ఎస్‌ఎల్‌బీసీ కాలువ నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూమి కబ్జాకు గురైంది. హైదరాబాద్–మునుగోడు బైపాస్ రోడ్డును ఆనుకొని ఇటీవల కొత్త కొత్త వెంచర్లు పుట్టగొడుగొల్లా పుట్టుకొస్తున్నాయి. వెంచర్లలోకి ప్రవేశించేందుకు దారిలేకపోవడంతో కాలువ భూమిని ఆక్రమించి అక్రమంగా రోడ్లు ఏర్పాటు చేశారు. ఓ వైపు ఆక్రమణకు గురైన ఎన్‌ఎపీ, ఎస్‌ఎల్‌బీసీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. కానీ నల్లగొండలో రియల్టర్లు మాత్రం ఎస్‌ఎల్‌బీసీ భూములను ఆక్రమించి వెంచర్లలోకి 30 ఫీట్ల వెడల్పుతో మూడు చోట్ల నుంచి రోడ్లు వేయడమేగాక, భూములకు నలువైపులా ఇనుపకంచెలు నిర్మించి ఆక్రమిస్తున్నారు. రూ.వందల కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో రూ.కోట్ల విలువైన భూమిని రియల్టర్లు కబ్జా చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది.
బైపాస్‌తో భూముల ధరలకు రెక్కలు
నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు గిరకబాయిగూడెం నుంచి లతీఫ్‌సాహెబ్ గుట్ట వెనుక భాగం నుంచి మునుగోడు రోడ్డుకు వెళ్లే దారిలో ఎస్‌ఎల్‌బీసీ ప్రధాన కాల్వ ఉంది. ఆ కాల్వ తవ్వే సమయంలో ఇరిగేషన్ శాఖ కాల్వ వెంట అప్పట్లో భూమిని సేకరించింది. ఆ భూమి పక్కనుంచి ప్రస్తుతం బైపాస్ రోడ్డు వస్తుండటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే కాల్వ వెంట ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి చుట్టుపక్కల భారీ ఎత్తున ఒక ప్రైవేట్ వెంచర్ వెలిసింది. దానికి దారులు లేవు. దీంతో అధికారులను ప్రసన్నం చేసుకోవడంతో వారు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండన్నట్లుగా వదిలేశారు. ఇక్కడ ఆ ఎస్‌ఎల్‌బీసీ స్థలానికి కూడా కడీలు పెట్టి పెన్సింగ్ కూడా రియల్టర్లే వేయడంతో ఆ భూమి కూడా ప్రైవేట్ భూమి అన్న తీరులో అక్కడ దర్శనమిస్తోంది.
బండ్లదారి కాదే..
సాధారణంగా ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరించినప్పుడు దాని వెనుక ఉండే వ్యవసాయ భూములకు మాత్రమే ఎడ్ల బండ్లు వెళ్లేలా దారి ఇస్తారు. అదీ రైతులు వెళ్లి వచ్చేందుకు ఒకచోట మాత్రమే ఇస్తారు. కానీ ఇక్కడ మూడు చోట్ల పెద్ద రోడ్లు వేశారు. అయినా నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదంటే దాని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక పక్క ప్రభుత్వం ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు పెట్టి పెన్సింగ్ వేసి, కాపాడాలని చెబుతుంటే నల్లగొండలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఏకంగా వెంచర్‌దారులకు భూమిని అప్పగించేశారు. ప్రభుత్వ భూమే కదా అని 30 ఫీట్ల వెడల్పు చొప్పున మూడు రోడ్లు వేసుకున్నారు. సగం వరకు సీసీ వేసుకుని మిగతా మట్టి రోడ్డు వేశారు. ఆ వెంచర్‌కు మూడుదారులు వేసి పెద్దగేట్లు పెట్టేసరికి దీంతో చూడటానికి మంచి లుక్ వచ్చింది. దీంతో కొనుగోలుదారులను ఆకర్షించేలా వెంచర్ తయారైంది. ఇలా ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్లు వేసుకుని కష్టమర్లను ఆకర్షించి ప్లాట్లు అమ్మేందుకు అధికారులు సహకరించారు. ఈ తతంగంలో భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత డీఈని అడిగితే వారికి దారి లేదు ఎలా వెళతారని సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వెంచర్‌దారులకు అలా ఇవ్వవచ్చా అని అడుగ్గా వెంటనే దాన్ని తీసివేస్తామని సంబంధిత అధికారులు చెప్పడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ
ఫ భూసేకరణ సమయంలో వ్యవసాయ బండ్ల బాటకు ఇచ్చేలా ఒప్పందం
ఫ అంతకు మించి రెండు మూడు చోట్ల రోడ్డు వేస్తున్నా పట్టించుకోని యంత్రాంగం
ఫ నల్లగొండ సమీపంలో ఆక్రమణకు గురవుతున్న ఎస్‌ఎల్‌బీసీ స్థలం


