13న పాలిసెట్‌ | - | Sakshi
Sakshi News home page

13న పాలిసెట్‌

May 12 2026 6:00 AM | Updated on May 12 2026 6:00 AM

రామగిరి(నల్లగొండ) : పాలిసెట్‌ – 2026 ప్రవేశపరీక్ష 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ సిహెచ్‌.నర్సింహారావు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో 13, నాగార్జునసాగర్‌ 2 సెంటర్లు కేటాయించినట్లు తెలిపారు. పరీక్షకు మొత్తం 5,310 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. 11 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట హెచ్‌బి పెన్సిల్‌, బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలని సూచించారు.

మ్యాపింగ్‌ ప్రక్రియ 90 శాతం పూర్తి చేయాలి

నల్లగొండ : స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌లో భాగంగా చేపట్టిన మ్యాపింగ్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోగా 90 శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మ్యాపింగ్‌ ప్రక్రియలో వెనుకబడిపోయిన మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ అశోక్‌రెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కాసోజు శంకరమ్మ

మోత్కూరు : మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మితో పాటు ఏడుగురు సభ్యులను నియమించారు. ఏడుగురు సభ్యులలో కాసోజు శంకరమ్మ ఒకరు.

నైపుణ్యాలతో మెరుగైన ఉపాధి

నల్లగొండ టూటౌన్‌ : నైపుణ్యాలతో మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించవచ్చని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఇన్నోక్యూటర్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో ఎంపికై న 20 మంది టీచర్లకు ఆయన నియామకపత్రాలు అందజేసి మాట్లాడారు. 20 మంది వివిధ పాఠశాలల్లో అధ్యాపకులుగా అర్హత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ హరీష్‌కుమార్‌, కొప్పుల అంజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇన్నో క్యూటర్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement