పక్కాగా ఇళ్ల లెక్క | - | Sakshi
Sakshi News home page

పక్కాగా ఇళ్ల లెక్క

May 12 2026 6:00 AM | Updated on May 12 2026 6:00 AM

జనగణనలో తప్పులు రావద్దు

నల్లగొండ : జనగణన–2027 మొదటి దశ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి గృహ గణనకు శ్రీకారం చుట్టారు. జూన్‌ 9 వరకు నెల రోజుల పాటు సాగే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లు జిల్లాలోని ప్రతి గడపను తట్టనున్నారు. గృహ గణనతో పాటు నివాస వసతులు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. కలెక్టర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, గణన తీరును పరిశీలించారు.

పకడ్బందీగా యంత్రాంగం ఏర్పాట్లు

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఇళ్ల గణన సజావుగా సాగేందుకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 3,117 మంది ఎన్యుమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 531 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఎన్యుమరేటర్లు తొలి మూడు రోజులు తమకు కేటాయించిన పరిధిలోని ఇంటి నంబర్లను సరిచూసుకోవడం, సరిహద్దులను గుర్తించడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఇళ్లకు స్టిక్కర్లు వేస్తూ అక్కడ రోడ్డు, బావి, బడి ఉందా అన్నింటిని పరిశీలించి మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్ని భవనాలతో పాటు నీటి ట్యాంకులను కూడా మ్యాపింగ్‌ చేస్తారు. నాలుగో రోజు నుంచి మొబైల్‌ యాప్‌ ద్వారా అసలైన డేటా సేకరణ ప్రారంభమవుతుంది. 34 రకాల వివరాలతో యాప్‌ ద్వారా చేయనున్నారు.

వలసలు.. ఇతర ప్రాంతాల్లో నమోదుపై స్పష్టత

జిల్లాలో నివసిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల వివరాల నమోదుపై అధికారులు కీలక వివరణ ఇచ్చారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నమోదు చేసుకున్నా, తుది గణాంకాల ప్రకారం వారి వివరాలు సొంత జిల్లాల ఖాతాలోకే చేరుతాయి. అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన వారు ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉండి అక్కడ వివరాలు నమోదు చేసినా, అవి జిల్లా జనాభా లెక్కల్లోకే వస్తాయని అధికారులు తెలిపారు.

రామగిరి(నల్లగొండ) : జనగణనలో తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలని సెన్సెస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రఘు, జిల్లా ఇన్‌చార్జి హోబాలాల్‌ అన్నారు. సెన్సెస్‌ తొలిదశలో భాగంగా గృహగణనను సోమవారం నల్లగొండ మండలం గుండ్లపల్లిలో వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వీయ గణన చేసుకున్న వారు ఐడీని ఎన్యూమరేటర్లకు తెలియజేసి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రూరల్‌ ఆఫీసర్‌ కె.పరశురామ్‌, ఎంపీ.యాకుబ్‌నాయక్‌, శేఖర్‌రెడ్డి, చారి, వంగూరి రమేష్‌ పాల్గొన్నారు.

ఫ పూర్తి వివరాలు సేకరించనున్న ఎన్యుమరేటర్లు

Advertisement
 
Advertisement
Advertisement