కేతేపల్లి : బక్రీద్ పండగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులతో నిఘా పెంచామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో గల టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ తీరును పరిశీలించి అక్కడ విధుల నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. కంటైనర్లు, లోడ్ వాహనాలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పశువులను రవాణా చేసే వ్యక్తులు తప్పనిసరిగా అనుమతి పత్రాలు, కొనుగోలు రశీదులు, వెటర్నరీ ధ్రువపత్రాలు తమ వెంట ఉంచుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవటం, గొడవలకు దిగటం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నకిరేకల్ సీఐ హరిబాబు, కేతేపల్లి, శాలిగౌరారం ఎస్‌ఐలు సతీష్, సైదులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. వినతులు స్వీకరించిన ఎస్పీ వాటిని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


