ఇంటి నంబర్లపై కసరత్తు.. | - | Sakshi
Sakshi News home page

ఇంటి నంబర్లపై కసరత్తు..

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

డాక్యుమెంట్‌ లేకుంటే అనేక సమస్యలు..

నల్లగొండ టూటౌన్‌ : నీలగిరి కార్పొరేషన్‌ పరిధిలో డాక్యుమెంట్‌ లేని స్థలాల్లో నివాసాలకు ఇంటి నంబర్ల సమస్య పరిష్కారం కోసం కసరత్తు జరుగుతోంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో కలెక్టర్‌ చంద్రశేఖర్‌.. పానగల్‌, నంద్యాల నర్సింహ్మారెడ్డి కాలనీల్లో పర్యటించి ఇంటి నంబర్లు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఏడు విలీన గ్రామ పంచాయతీలు, వాటి ఆవాస గ్రామాలు, పానగల్‌, నంద్యాల నర్సింహ్మారెడ్డి కాలనీ, ఏఆర్‌నగర్‌, వెంకటరమణ కాలనీ, న్యూ సూర్యవంశీ కాలనీ గుట్ట, పాతబస్తీ ప్రాంతం, మాన్యంచల్క, హైదర్‌ఖాన్‌గూడ, సుందరయ్య కాలనీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న నివాస స్థలాలు, ఇండ్లకు పూర్వం నుంచి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేవు. గ్రామ కంఠం భూమలు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కొందరికి ఇంటి నంబర్లు ఉండగా, మరి కొందరికి లేవు. దాంతో ఇంటికి సంబంధించిన గుర్తింపు పత్రం అవసరమైనప్పుడు సమస్య వస్తోంది.

9 వేలకు పైగా ఇళ్లు

నీలగిరి నగరంలోని ఆయా ప్రాంతాల్లో పూర్వం నుంచి నివాసం ఉంటూ డాక్యుమెంట్‌లు లేని ఇండ్లు 9,645 ఉన్నట్లు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు భావిస్తున్నారు. ఈ ఇళ్లలో కొన్నింటికి ఇంటి నంబర్లు లేని కారణంగా కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను రావడం లేదు. డాక్యుమెంట్స్‌ లేని కారణంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం ఓనర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద ఇంటి నంబర్లు ఇవ్వాల్సి వస్తోంది. దాంతో సంబంధిత ఇంటి యజమానులు తమ పేరు లేకుండా ఇంటి నంబర్లు ఇస్తే తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కలెక్టర్‌ ఆయా కాలనీల్లో పర్యటించిన సందర్భంలో ఇంటి నంబర్లు లేని ఇళ్లు, డాక్యుమెంట్‌ లేకపోవడం, కొంతమందివి రాసుకున్న పాత కాగితాలు, తాతల పేరు మీద ఉన్న ఇళ్లకు ప్రభుత్వం పట్టా ఇస్తే విక్రయించివి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకున్నవి, అసలు విలీన గ్రామాల్లో రికార్డుల్లో కూడా ఇంటి నంబర్లు లేని లాంటి సమస్యలు గుర్తించారు. ఇక్కడ గుర్తించిన సమస్యలపై కలెక్టర్‌ నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఏళ్ల నుంచి వస్తున్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుంతో లేదో వేచి చూడాల్సిందే.

ఫ నీలగిరి కార్పొరేషన్‌లో

ఇళ్ల వివరాలు ఆరా తీసిన కలెక్టర్‌

ఫ డాక్యుమెంట్‌ లేని ఇళ్లకు

సంబంధించి పలు సమస్యల గుర్తింపు

ఫ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కలెక్టర్‌

సొంతిల్లు ఉన్నా.. దానిపై వారికి ఎలాంటి హక్కు పత్రం లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. డాక్యుమెంట్‌ లేని కారణంగా ఆస్తి పన్ను కూడా రెండింతలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు కొత్తగా నిర్మించాలన్నా, బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకుందామన్నా డాక్యుమెంట్‌ కావాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకుందామన్నా డాక్యుమెంట్‌ లేని కారణంగా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో డాక్యుమెంట్‌ లేనివి కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడలేదు. ఇంతటి జఠిలమైన సమస్యకు పరి ష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement