నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన (సెన్సస్) ప్రక్రియలో భాగంగా.. ఈసారి వినూత్నంగా ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (స్వీయ గణన)కు జిల్లాలో ఆశించిన స్పందన లభించలేదు. ఏప్రిల్ 26 నుంచి ఈ నెల 10 వరకు గడువు ఇచ్చినప్పటికీ, ప్రజల నుంచి స్పందన కరువైంది. కలెక్టర్ చంద్రశేఖర్ పదేపదే అవగాహన కల్పించినప్పటికీ, జిల్లాలోని 5 లక్షల పైచిలుకు కుటుంబాలలో కేవలం 17,161 కుటుంబాలు మాత్రమే స్వీయ గణన చేసుకున్నాయి. విద్యావంతులు కూడా దీనిపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. స్వీయ గణన చేసుకున్న వారు, ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు ఆ వివరాలు చూపిస్తే సరిపోయేది. గడువు ముగియడంతో ఇకపై ఎన్యుమరేటర్ల ద్వారానే వివరాలు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
రెండు దశలో జనగణన
జనగణనను ఈసారి రెండు దశలుగా విభజించారు. మొదటి దశలో ఇళ్ల గుర్తింపు, రెండో దశలో జనాభా గణన జరగనుంది. ఈ క్రమంలో, నేటి నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటి సర్వేను ప్రారంభించనున్నారు. జూన్ 9 వరకు మొదటి దశలో భాగంగా ఇళ్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలోని 33 మండలాలు, 8 మున్సిపాలిటీల్లో ఈ సర్వే ముమ్మరంగా సాగనుంది. వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరిలో రెండో దశ కింద పూర్తిస్థాయి జనాభా లెక్కింపు చేపట్టనున్నారు.
సిబ్బంది నియామకం
జనగణన కోసం జిల్లావ్యాప్తంగా 3,117 మంది ఎన్యుమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 531 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 నుంచి 300 ఇళ్లను (సుమారు 700 మంది జనాభా) కవర్ చేయాల్సి ఉంటుంది. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసి.. జనగణన కిట్‌లను అందజేశారు.
తొలిసారి డిజిటల్ పద్ధతిలో..
ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు.ఎన్యుమరేటర్లు తమ స్మార్ట్‌ఫోన్లలోని ప్రత్యేక యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట ‘ఆఫ్‌లైన్’లో వివరాలు సేకరించి, తర్వా త సర్వర్‌లో అప్‌లోడ్ చేసే సౌకర్యం కల్పించారు.
జిల్లాలో 16,18,416 మంది జనాభా
ఇటీవలి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 16,18,416 మంది జనాభా ఉన్నట్లు అంచనా. ఈ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని 2027 జనగణన కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి తమ ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించి, సరైన వివరాలు అందించాలని అధికారులు కోరుతున్నారు.
ఫ వివరాలు నమోదు చేసింది
17,161 కుటుంబాలే..
ఫ ముగిసిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ గడువు
ఫ నేటి నుంచి గృహాల గుర్తింపు


