మిర్యాలగూడ మున్సిపాటీలో అవకతవకలు | - | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడ మున్సిపాటీలో అవకతవకలు

May 9 2026 9:31 AM | Updated on May 9 2026 9:31 AM

● మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యపు పనితీరుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీశ్ఛంద్ర తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్‌ చేసినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రజలు 9440446106, టోల్‌ ఫ్రీ నెం.1064లను సంప్రదించాలని కోరారు.

మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. కార్యాలయంలో అధికారులు పలు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్‌ దరఖాస్తులు, కార్యాలయ పనితీరును పరిశీలించారు. రికార్డులు, ఆర్థిక లావాదేవీల్లో పలు అవకతవకలు కనిపించినట్లు ఏబీసీ బ్యూరో హైదరాబాద్‌ ఎస్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సింధుసామ్‌ శుక్రవారం తెలిపారు.

ఏసీబీ అధికారులు గుర్తించిన అంశాలు ఇలా..

● ఆస్తి పన్ను విషయంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.24.86కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. కేవలం రూ.9.17కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ.15.68కోట్లు బకాయి ఉంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లింది.

● దుకాణాల పన్ను వసూళ్లలో లోటు ఏర్పడినట్లు గుర్తించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీలో 1756 దుకాణాలకు రూ.43.03 లక్షల పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. రూ.28.35 లక్షలు మాత్రమే వసూలు చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.36.81లక్షలు కాగా కేవలం రూ.15.01 లక్షలు మాత్రమే వసూలు చేయడంతో ఈ లోటుతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగింది.

● గత ఆర్థిక సంవత్సరంలో అక్రమ నిర్మాణాలపై 54 ఫిర్యాదులు అందగా చాలా కేసుల్లో నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్ణీత గడువు ముగిసిన తరువాత కూడా తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదు, తనిఖీ సమయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బొలుగురి వెంకన్న అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు.

● చేయూత పింఛన్‌, జనన, మరణ విభాగంలో 116 జనన దరఖాస్తులు, 1 మరణ దరఖాస్తులు ఉండగా ఏడు రోజుల గడువు దాటినా వాటిని పెండింగ్‌లో పెట్టినట్లు గుర్తించారు. పోర్టల్‌లో ఎంట్రీ ఆప్షన్‌ లేకపోవడంతో 1,820 పెన్షన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు.

● టౌన్‌ ప్లానింగ్‌లో భవన అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం 2024–25లో రూ.3.29కోట్ల నుంచి 2025–26లో రూ.3.05కోట్లకు పడిపోయిందని, ఇది అధికారుల పనితీరు లోపాన్ని సూచిస్తోంది.

● 2025–26లో మ్యుటేషన్‌ దరఖాస్తుల్లో 86కుగాను 61 పెండింగ్‌లో ఉన్నాయని, ఇది ప్రజా అభ్యర్థనల పరిష్కారంలో లోపాిన్ని చూపిస్తోందని, 2026–27లో 18 దరఖాస్తులు మాత్రమే రాగా పెండింగ్‌ దరఖాస్తులు కలిపి 34 ఆమోదించినట్లు చూపించారు.

● కీలక రిజిస్టర్ల సరైన నిర్వహణ లేనట్లు గుర్తించారు. భవన అనుమతి, అక్రమ లేఅవుట్‌లు, రిజిస్టర్లు సరిగా నిర్వహించలేదని, కేవలం మూడు రిజిస్టర్లు మాత్రమే పాక్షికంగా ఉన్నాయని, వాటిపై అదికారుల సంతకాలు లేవని తేల్చారు. 21రోజుల పరిమితిని దాటిన పలు భవన నిర్మాణ అనుమతి దరఖాస్తులు ఉన్నాయని అక్రమ నిర్మాణాలపై 54 ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేకుండా పెండింగ్‌లో ఉంచినట్లు గుర్తించారు.

● 4,638 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను ప్రాసెస్‌ చేయలేదని దీని వల్ల రూ.15కోట్ల ఆదాయం రాకుండా పోయిందని, ఇది తీవ్రమైన విధానపరమైన లోపాన్ని తేల్చారు.

● కార్యాలయంలో వ్యక్తిగత నగదు రిజిస్టర్‌ నిర్వహించలేదని, దీనివల్ల సిబ్బంది వద్ద ఉన్న నగదుకు జవాబుదారీతనం తనిఖీ చేయడం కష్టంగా మారింది. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌ ప్రకారం మార్చి 2026లో కొన్ని రోజులు కొందరు ఉద్యోగులు గైర్హాజరు అయినప్పటికీ రికార్డుల్లో మాత్రం పూర్తి నెల జీతం క్లెయిమ్‌ చేసినట్లు గుర్తించారు.

● మున్సిపల్‌ అధికారుల వినియోగం కోసం ఇంధన చార్జీల కింద నెలకు రూ.19.33 లక్షలు క్లెయిమ్‌ చేస్తున్నా దానికి రికార్డులు నిర్వహించడం లేదు. వాహనాల ల్యాగ్‌ బుక్స్‌ లేవని, కేటాయించిన వాహనాలకు సరైన రికార్డులు నిర్వహించడం లేదని గుర్తించారు.

ఫ ఏసీబీ సోదాల్లో గుర్తింపు ఫ అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు

Advertisement
 
Advertisement
Advertisement