కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో కొన్నది సగమే.. | - | Sakshi
Sakshi News home page

కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో కొన్నది సగమే..

May 9 2026 9:31 AM | Updated on May 9 2026 9:31 AM

సరిపడా లారీలు లేకున్నా.. ఉన్నట్లు లెక్కలు

సాక్షి ప్రతినిది, నల్లగొండ : ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతకు అష్టకష్టాలు తప్పడం లేదు. కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కొన్నది సగమే. ఇంకా కల్లాల్లో సగం ధాన్యం అలాగే ఉంది. అన్నీ సక్రమంగా ఉన్నాయని కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయించి మిల్లులకు పంపితే.. అక్కడ కొర్రీలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మరోవైపు లారీల కొరత రైతులను వేధిస్తోంది. మొత్తంగా ఈ యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లలో అధికారుల ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

అన్ని చోట్లా దోపిడీ..

ఈ సీజన్‌లో ఎండల తీవ్రత కారణంగా ధాన్యం కల్లాల్లో పోసిన రెండు మూడు రోజుల్లోనే నిర్దేశిత తేమ శాతం వస్తోంది. అయినా రైతులు దోపిడీకి గురవుతున్నారు. తాలు పేరుతో కేంద్రాల్లోనే అదనంగా తూకం వేస్తున్నారు. బస్తాకు రూ.3, రూ.4 ఇస్తేనే లారీలను పంపుతున్నారు. ఇక మిల్లుకు వెళ్లిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటే బస్తాకు 3, 4 కిలోల కోతకు ఒప్పుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి మిల్లుకు వెళ్లిన ధాన్యాన్ని దింపుకునేలా చేయడం, ట్రక్‌ షీట్లు తెప్పించడం, ఆన్‌లైన్‌ చేయడం ఈ బాధ్యతంతా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదే. అయినా వారు పట్టించుకోకుండా రైతులనే వెళ్లి మిల్లర్‌తో మాట్లాడుకొమ్మని చెప్పి దోపిడీకి సహకరిస్తున్నారు. ఇదంతా చూస్తున్న పౌరసరఫరాల విభాగం మిన్నకుండి పోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఏ గ్రేడ్‌ను.. బీ గ్రేడ్‌ మార్చుతున్న మిల్లర్లు

కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. అది ఏ గ్రేడ్‌ ధాన్యమా? బీ గ్రేడ్‌ ధాన్యమే అన్నది వ్యవసాయ అధికారులు సర్టిఫై చేస్తారు. అలా వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్‌ దింపుకొని ట్రక్‌ షీట్‌ ఇచ్చేయాలి. కానీ కొందరు మిల్లర్లు తాలు, మట్టి పేరుతో తమ వద్దకు వచ్చిన ధాన్యంలో కోత పెట్టడమే కాకుండా, గ్రేడ్‌ మార్చేసి మరీ దోచుకుంటున్నారు. అందుకు ఒప్పుకుంటే సరి. లేదంటే దింపుకోకుండా పెండింగ్‌ పెడుతుండటంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.

కొన్నది 56.53 శాతమే..

జిల్లాలో ఏప్రిల్‌ 1వ తేదీన కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నెల రోజులు దాటిపోయింది. 6,50,934 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అందులో ఇప్పటివరకు 3,67,985 మెట్రిక్‌ టన్నుల (56.53 శాతం) ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యంలో 3,65,853 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మిల్లులకు వెళ్లిన ధాన్యంలో మిల్లర్లు 1,99,191 మెట్రిక్‌ ధాన్యాన్ని (54.44 శాతం) మాత్రమే దింపుకున్నారు. అంటే మిల్లులకు వెళ్లిన ధాన్యంలో సగం ధాన్యానికి మిల్లర్లు ఓకే చెప్పలేదు. ఈ వ్యవహారంలో అధికారులు పక్కా చర్యలు చేపట్టడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు నిర్ణీత సంఖ్యలో లారీలు లేకున్నా ఉన్నట్లు అధికారులు బుకాయిస్తున్నారు. ఈనెల 5వ తేదీ వరకు మిల్లులకు వెళ్లిన 350 లారీల్లో సగం మిల్లుల వద్ద ఉన్నాయి. మిగతా సగమే తిరుగుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 450 లారీలను ఎందుకు కొనుగోలు కేంద్రాలకు పంపించడం లేదన్నది ప్రశ్న. అంతేకాదు అటు లారీల యజమానులు, మిల్లర్లతో కొందరు అధికారులు కుమ్మకై ్క ముడుపుల బాగోతంతో రైతులను కష్టాలపాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఫ కేంద్రాల్లో ధాన్యం కాంటా వేసినా.. మిల్లుల్లో కొర్రీలు

ఫ అడుగడుగునా దోపిడీకి గురవుతున్న రైతులు

ఫ ధాన్యం కొనుగోళ్లలో కనిపిస్తున్న ప్రణాళికా లోపం

Advertisement
 
Advertisement
Advertisement