నల్లగొండ టూటౌన్ : స్పోర్ట్స్ స్కూల్స్, హాస్టల్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లాకు చెందిన వారు బాలురు 8 మంది, ఆరుగురు బాలికలు రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు అన్ని ఒరిజినల్స్‌తో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
లారీల కాంట్రాక్టర్లకు జరిమానా
నల్లగొండ : ధాన్యం రవాణా విషయంలో అలసత్వం వహిస్తున్న నలుగురు కాంట్రాక్టర్లకు జరిమాన విదించినట్లు పౌర సరఫరాల శాఖ మేనేజర్ రాంపతి తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’ లో ‘డబ్బులు ఇస్తేనే లోడింగ్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ సందర్భంగా మేనేజర్ రాంపతి మాట్లాడుతూ ధాన్యం రవాణలో ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపడుతుందన్నారు. రైతులను ఎవరైనా డబ్బులు అడిగితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ టూటౌన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్విని యోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.సుజాత అన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్లగొండలోని టీఎన్‌జీఓ భవన్‌లో మత్స్యకారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మార్కెటింగ్, కలుపు నివారణ, లైసెన్స్ పొందడం తదితర వాటిపై మత్స్యకారులు అవగాహన పొందాలన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ నాగరాజు, కోఆపరేటివ్ అధికారి భూక్యా వెంకన్న, మత్స్య శాఖ జిల్లా అధికారి రాజారామ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లిలో విజిలెన్స్ తనిఖీలు
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పశువుల సంతకు సంబంధించి గత కాంట్రాక్టర్ 2016 నుంచి 2026 మార్చి వరకు కొనసాగారు. మార్చి 25న నిర్వహించిన వేలంలో కల్వకుర్తికి చెందిన కాంట్రాక్టర్ సుమారుగా రూ.4 కోట్లకు దక్కించుకున్నారు. అయితే పాత కాంట్రాక్టర్ 10 సంవత్సరాలుగా పశువుల సంత కాంట్రాక్టును దక్కించుకుని, పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నాడని, గత సంవత్సరానికి సంబంధించిన వేలం ఫేక్ చలాన్లు ఇచ్చాడని గుర్తించడంతో పలువురు సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పైఅధికారులు జిల్లా విజిలెన్స్ అధికారుల ద్వారా కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పశువుల సంత కాంట్రాక్టుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.
11 నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ వారం
నల్లగొండ : ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎడ్యుకేషన్ వారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల సస్పెన్షన్
నల్లగొండ : ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు నలుగురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక్రవారం సస్పెండ్ చేశారు. మండలంలోని పెద్ద సూరారం, నార్కట్‌పల్లి మండలం బాచకుంట, త్రిపురారం, చండూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంటర్ చేయలేదు. ఈ విషయమై కలెక్టర్ సీరియస్ అయి ఆయా కేంద్రాలకు చెందిన నలుగురు ఇన్‌చార్జిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


