నల్లగొండ : వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఆయా విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తాగునీటి విషయంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సరఫరాలో సమస్యలు, మరమ్మతులు ఉంటే వెంటనే సరి చేయాలన్నారు. పూర్తిస్థాయిలో పరీక్ష నిర్వహించిన తర్వాతే తాగునీటిని సరఫరా చేయాలని, ఇందుకు గాను ప్రతి మున్సిపాలిటీకి తాగునీటి టెస్టింగ్ కిట్లను ఇచ్చామన్నారు. ఏఈలు గ్రామాల్లో సర్పంచులతో అనుసంధానంలో ఉండి ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా పర్యవేక్షించాలని సూచించారు. తాగునీటిపై పత్రికల్లో వచ్చే వార్తలకు స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు, వివరణలు ఇవ్వాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఎస్‌ఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇంజనీరింగ్ అధికారులు చూడాలని, ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో ప్రజారోగ్య ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఈఈ శాంతకుమారి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్‌నాయక్, మిషన్ భగీరథ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


