చందంపేట : నా పేర ఉన్న భూమిని నా కుమారుడు ఆయన పేరిట మార్చుకున్నాడని, వెంటనే తనకు న్యాయం చేయాలని చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు నక్క లింగమ్మ కోరింది. ఈ మేరకు ఆమె గురువారం చందంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కుమారుడు నక్క వెంకటయ్య తనకు తెలియకుండా పెన్షన్‌కు వేలిముద్ర పడుతలేదని నమ్మబలికి తన సంతకం తీసుకొని తన పేర ఉన్న 1.13 ఎకరాల భూమిని మోసపూరితంగా ఆయన పేరిట మార్చుకున్నాడని పేర్కొంది. తన కొడుకు తనను సరిగా పట్టించుకోడని, తన బాగోగులు కూడా చూడడని, కుమార్తెలే చూస్తారని ఆమె వాపోయింది. ఈ విషయమై తహసీల్దార్ శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఫిర్యాదు అందజేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


