‘కార్పొరేట్‌‘ కళాశాలలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

‘కార్పొరేట్‌‘ కళాశాలలకు దరఖాస్తుల ఆహ్వానం

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

నల్లగొండ : పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించి ఉచిత విద్యనందించేందుకు రెసిడెన్షియల్‌ వసతి, విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్న జిల్లాలోని ప్రైవేట్‌ కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు వి.వెంకటకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రిప్యూటెడ్‌ జూనియర్‌ కళాశాలలను 2026–27 విద్యా సంవత్సరానికి నూతనంగా ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల కళాశాలలు అయిదేళ్లకు సంబంధించిన అకాడమిక్‌ ప్రొపైల్‌ ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కళాశాల ఈపాస్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డులతో లాగిన్‌ అయి వారి కళాశాలలను రిజిస్ట్రేషన్‌ చేసుకుని హార్డు కాపీని సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 12న సాయంత్రం 5 గంటలలోగా తమ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తులు

రామగిరి (నల్లగొండ): నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్‌ జి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సంర ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 20 సీట్లు, 3వ తరగతి 1 సీటు ఖాళీ ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

టైలరింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణ

నల్లగొండ : నల్లగొండలోని రాంనగర్‌లో గల ఎస్‌బీఐ ఆర్‌సెటి (స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ)లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్‌ సియాజిరాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీలోగా ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌ : 9701009265 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలి

దేవరకొండ : వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలని జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి శివశంకర్‌రెడ్డి అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో శివగంగా ట్రేడర్స్‌, తిరుమల రోటరీ ఆయిల్‌ మిల్‌, నందిని సంస్థలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురు వ్యాపారులు ఫుడ్‌ లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు సాగిస్తున్నారని, అలాగే 15 లీటర్ల టిన్ల నుంచి గానుగ యంత్రం ద్వారా లూజ్‌ ఆయిల్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. పలు దుకాణాల నుంచి ఆయిల్‌ నమూనాలను సేకరించినట్లు పేర్కొన్నారు. గానుగ కేంద్రాల్లో నాణ్యమైన ముడి పదార్థాలను మాత్రమే ఉపయోగించాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆ శాఖ సిబ్బంది ఉన్నారు.

నేడు ‘జనగణన రన్‌’

నల్లగొండ : జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం ఉదయం 7 గంటలకు నల్లగొండలోని ఎన్జీ కళాశాల నుంచి క్లాక్‌ టవర్‌ వరకు శ్రీజనగణన అవగాహన రన్ఙ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్‌ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రన్‌లో జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, మేయర్‌ బుర్రి చైతన్య పాల్గొంటారని తెలిపారు.

సాగర్‌ ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా రాజు

నాగార్జునసాగర్‌ : స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) నాగార్జునసాగర్‌ యూనిట్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా బి.రాజు గురువారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన విజయభాస్కర్‌రావు బదిలీపై హైకోర్టు రక్షణ విధులకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పనిచేసిన రాజు నాగార్జునసాగర్‌కు వచ్చారు. రాజుకు సాగర్‌డ్యాం, జెన్‌కో ఆర్‌ఐలు ప్రతాప్‌నాయుడు, శ్రీనివాసరావు సిబ్బంది స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement