ఆసరా పింఛన్ల కోసం చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలు రికార్డులో నమోదు చేశాం. క్షేత్ర స్థాయికి సిబ్బందిని పంపి అర్హులను ఎంపిక చేయిస్తాం. వెబ్‌సైట్ ఓపెన్ కాగానే దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తాం.
– శరత్‌చంద్ర,
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలోని 48 డివిజన్లలో ఆసరా పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులను మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం పరిశీలిస్తోంది. ఒక్కొక్కరు రెండుసార్లు దరఖాస్తులు చేసుకున్న వారు ఉండడంతో డివిజన్ల వారీగా దరఖాస్తులను విభజించేందుకు లబ్ధిదారులను తేల్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2023 నుంచి చేసుకున్న వాటితోపాటు 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన 1,870తో కలిపి మొత్తం 4వేలకుపైగానే ఆసరా పింఛన్ దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. కానీ, కొందరికి ఓకే చేసి మిగతా దరఖాస్తులను పక్కన పెట్టారు.
తెరుచుకోని ఆన్‌లైన్ సైట్
ఆసరా పింఛన్ల కోసం నల్లగొండ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రోజూ 20 నుంచి 30 మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆసరా పింఛన్ల దరఖాస్తులను ఆన్‌లైన్ చేసేకి సైట్‌ను మూసేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసరా పింఛన్లకు సంబంధించి ఆన్‌లైన్ సైట్ మూసివేయడంతో దరఖాస్తులను ఆన్‌లైన్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
అర్హులను తేల్చే పనిలో యంత్రాంగం
ఆసరా పింఛన్ల కోసం గతం నుంచి చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల జాబితా రూపొందించాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం క్షేత్ర స్థాయికి సిబ్బందిని పంపి అర్హులను తేల్చి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఆసరా పింఛన్ల ఆన్‌లైన్ సైట్ ఓపెన్ కాగానే దరఖాస్తుదారుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
ఫ నీలగిరిలో పింఛన్ అర్జీలను పరిశీలిస్తున్న యంత్రాంగం
ఫ లబ్ధిదారులను తేల్చేందుకు కసరత్తు
ఫ 2023 నుంచి ఇప్పటి వరకు
4 వేలకుపైగా దరఖాస్తులు


