నాగార్జునసాగర్ : రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. గురువారం నాగార్జునసాగర్‌లోని కృష్ణానది తీరాన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన రైతు డిక్లరేషన్ ప్లెక్సీలు, కాపీలకు పిండ ప్రదానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సహాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందన్నారు. రూ.2లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు నిబంధనల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో రైతులకు సాగునీరు అందించడం, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతు డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని హామీలను తక్షణమే అమల చేయాలన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫ సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
ఫ రైతు డిక్లరేషన్ కాపీలకు పిండ ప్రదానం


