రేపు మత్స్యకారులకు అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

రేపు మత్స్యకారులకు అవగాహన సదస్సు

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

నల్లగొండ టూటౌన్‌ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోని టీఎన్‌జీఓస్‌ భవన్‌లో ఈనెల 8న ఉదయం 10 గంటలకు మత్స్యకారులకు, మత్స్య రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి రాజారామ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ సదస్సుకు మత్స్య మార్కెటింగ్‌, లైసెన్స్‌దారులు, మత్స్య సంఘాల సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

యాదగిరి క్షేత్రంలో

స్థానిక బదిలీలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈఓ భవానీ శంకర్‌ పలు విభాగాలకు సంబంధించిన అధికారులను స్థానికంగా బదిలీలు చేశారు. సుమారు 25 మందిని బదిలీ చేశారు. వీరిలో ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిసెంట్లు, రికార్డు అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా వెంటనే తమకు కేటాయించిన విభాగాల్లో చేరాలని ఈఓ ఆదేశించారు.

మెరుగైన ర్యాంకు సాధిద్దాం

నల్లగొండ టూటౌన్‌ : స్వచ్ఛ సర్వేక్షన్‌లో నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఉద్యోగులమంతా కృషి చేద్దామని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బి.శరత్‌చంద్ర అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉద్యోగులతో నిర్వహించి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షన్‌–2026లో సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చే విధంగా ఉద్యోగులు, సిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు. వేసవిలో నగరంలో ఎక్కడ కూడా తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. జంక్షన్‌ల వద్ద షేడ్‌ నెట్స్‌ ఏర్పాటు చేసి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నారు. సమావేశంలో ఈఈ రాములు, ఏసీపీ కృష్ణవేణి, డీఈ అశోక్‌, ఆర్వో శివరాంరెడ్డి, ఏఈ అసీంబాబా తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడెం వద్ద

ట్రాఫిక్‌ జామ్‌

భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి మండల శివారులోని కొత్తగూడెం సమీపంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మామిడికాయల లోడ్‌లతో లారీలు, ట్రక్కులు, ఆటోలు, మినీవాహనాలు కొత్తగూడెం వద్ద ఉన్న పండ్ల మార్కెట్‌కు వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు వెంట అస్తవ్యస్తంగా పార్కింగ్‌ చేస్తుండడంతో పోచంపల్లికి నుంచి వచ్చే పోయే వాహనాలు, బస్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి గంటల తరబడి నిలిచిపోవడంతో హైదరాబాద్‌కు వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ సమస్యను బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నేత గుత్తి బాలశంకర్‌.. భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందిస్తూ వనస్థలిపురం ట్రాఫిక్‌ ఏసీపీ నవీన్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎంపీ ఆదేశాల మేరకు ఏసీపీ వెంటనే ఘటన స్థలాన్ని సందర్శించారు. ట్రాఫిక్‌ సమస్యను గురువారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement