డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేయండి | - | Sakshi
Sakshi News home page

డిమాండ్‌ ఉన్న పంటలను సాగుచేయండి

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

రామగిరి (నల్లగొండ) : రైతులు డిమాండ్‌ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్‌ రైతు వేదికలో జరిగిన రైతు వారోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాయిల్‌ హెల్త్‌ కార్డులను ప్రారంభించిందని, గ్రామాలో ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా భూముల సారవంతం పరిశీలిస్తామన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కోల్డ్‌ స్టోరేజీ వంటి సౌకర్యాలు వినియోగించుకుని లాభాలు పొందవచ్చన్నారు. వరిలో దొడ్డు బియ్యం కాకుండా సన్నరకాలను పండించాలన్నారు. తిప్పర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఉన్న భూమిని రైస్‌ మిల్‌ ఏర్పాటుకు నాబార్డు అధికారులను సంప్రదిస్తామన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. రైస్‌ మిల్లర్లు, లారీల కొరత, వర్షం తదితర కారణాల వల్ల కొనుగోళ్లలో కొంత జాప్యం జరుగుతుందని, సమస్యలన్నీ అధిగమిస్తామన్నారు. ప్రస్తుతం ధాన్యం తరలించేందుకు 900 లారీలు ఏర్పాటు చేశామని, కేవలం 20 రోజుల్లో 3 లక్షల ఇరవై వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం మిల్లుల్లో దిగుమతి సమస్య లేదన్నారు. నల్లగొండ మేయర్‌ బుర్రి చైతన్య మాట్లాడుతూ సహకార శాఖ సొసైటీల ద్వారా అందించే పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పత్యానాయక్‌, నల్లగొండ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జూకూరి రమేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగరత్నరాజు, సహదేవరెడ్డి, మార్కెటింగ్‌ ఏడీ ఛాయాదేవి, ఎల్‌డీఎం శ్రామిక్‌, డీఏఓ శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement