సాక్షి నెట్‌వర్క్ : జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు తీశారు. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చెట్లు విరిగి ఇళ్లపై పడ్డాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లపైకప్పు లేచిపోయింది. మిర్యాలగూడ సమీపంలోని గూడూరు, యాద్గార్‌పల్లి, శెట్టిపాలెం, అవంతీపురం వద్దనున్న రైస్ మిల్లుల్లో గోదాముల పైకప్పు రేకులు లేచిపోయాయి. కొన్ని మిల్లుల్లో కరెంట్ పరికరాలు కాలిపోయాయి. బాయిలర్ చిమ్నిలు ధ్వంసమయ్యాయి.
పగలు ఎండ.. సాయంత్రం వర్షం
జిల్లాలో మూడు నాలుగు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం కూడా ఉదయం 9 గంటల నుంచే ఎండతీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి. దాంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
రైతుల పరుగులు
సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలు వీయడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకునేందుకు ప్రయత్నించగా ఈదురు గాలులు, వర్షం దాటికి కొట్టుకుపోవడంతో ఇబ్బంది పడ్డారు. చాలాచోట్ల కాంటా వేసిన బస్తాలు తడిసిపోయాయి. రాశుల కిందికి వర్షపు నీరు చేరింది.
ఫ పలు ప్రాంతాల్లో ఈదురు గాలుల బీభత్సం
ఫ విరిగిన విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు
ఫ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం


