నల్లగొండ : నల్లగొండలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా విజయవంతం అయ్యిందని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలకు ఈ నెల 2న 125 కంపెనీలు, 2000 మంది నిరుద్యోగులు హాజరు కాగా, 3న 23 కంపెనీలు, 150 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళా ద్వారా అనేక మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు.
ప్రధాని సభను విజయవంతం చేయాలి
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లో ఈ నెల 10న ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి కోరారు. ఆదివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరు కావాలన్నారు. సమావేశంలో బోగరి అనిల్‌కుమార్, రాజు పాల్గొన్నారు.
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు విఫలం
మునుగోడు : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తిరిపారి వెంకటేశ్వర్లు అన్నారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మునుగోడులో ఆ సంఘం జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి బండారి శంకర్, నాయకులు చాపల శ్రీను, విప్లవ్‌కుమార్, బద్దుల శశి, అందుగుల మహేష్, పాండు పాల్గొన్నారు.


