సామాజిక ఉద్యమంలా ‘రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు’ | - | Sakshi
Sakshi News home page

సామాజిక ఉద్యమంలా ‘రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు’

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

నల్లగొండ టౌన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 27 నుంచి నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, అన్నదాతల అవగాహన కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్వహిస్తామని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ అందాస్‌ జానయ్య తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో యూనివర్సిటీ సైంటిస్టులు, వివిద పరిశోధన కేంద్రాలకు చెందిన సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 గ్రామాల్లో లక్షలాది మంది రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నామన్నారు. ప్రధానంగా అధిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల వాడకం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారం పరిరక్షించడంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. పంటల మార్పిడి విధానంపై అవగాహన కల్పించి రైతుల ఆదాయ పెంపుపై శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే కంపాసాగర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.లింగయ్య, శాస్త్రవేత్తలు డాక్టర్‌ జి.శివప్రసాద్‌, కె.సంధ్యారాణి, జి.స్వాతి, ఎ.రాములమ్మ, హిమబింధు, సాయిప్రియ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement