అడుగడుగునా అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అడ్డంకులు

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

ఒత్తిడితోనే కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అడుగడుగునా కొర్రీలు, అధికారుల అలసత్వం వెరసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఽఫలితంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రైతుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం ఇరకాటంలో పడుతున్నారు. అది తట్టుకోలేకనే తాజాగా కనగల్‌ మండలం బచ్చన్నగూడెం కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఆందోళనకు కారణమైంది.

మొదట నుంచీ జాప్యమే..

ఏప్రిల్‌ 2వ తేదీన ధాన్యం కొనుగోల్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మిల్లర్లు తాలు పేరుతో కిరికిరి పెడుతూనే ఉన్నారు. అధికారులు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి రైతులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పినా, పెడచెవిన పడుతున్నారు. ఐకేపీ, ఇతర ప్రభుత్వ కొనుగోలు సంస్థల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మాత్రం తాలు ఉందంటూ దించుకోవడం లేదు. రైతులే స్వయంగా మిల్లుల వద్దకు వెళ్లి కోతలకు ఒప్పుకుంటేనే ఽఆ ధాన్యాన్ని దింపుకుంటున్నారు. దీంతో లారీలు రోజులు తరబడి అక్కడే ఉండాల్సి వస్తోంది.

బయటి ధాన్యం యథేచ్ఛగా దిగుమతి

ఇతర జిల్లాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటూ మిల్లర్లు దిగుమతులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు ఎందుకు ఆగిపోతున్నాయి.. అసలు ఏదైనా మిల్లుకు కేటాయించిన ధాన్యం ఎంత? వెళ్లిన లారీలు ఎన్ని? ఎందుకు ధాన్యం దింపుకోవడం లేదు? నిజంగా మిల్లర్‌ రిజెక్ట్‌ చేస్తే ఏం చేయాలన్నది నిర్ణయించాల్సిన అధికారుల కమిటీ ఏం చేస్తోంది? అన్న దానికి సమాధానాలు లేకుండాపోయాయి. దీంతో మిల్లర్లకు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ధాన్యం దింపుకోకపోతే ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటీ రెండు మిల్లులకు పంపిన ధాన్యం ఎంత? వారు దింపుకున్నది ఎంత? మిలుల్లోకి వచ్చిన ధాన్యం ఎంత? అన్న లెక్కలు తేల్చితే జరిగిందేంటన్నది తేలే అవకాశం ఉంది.

రైతుల నుంచి ఒత్తిడి..

ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. కల్లాల వద్ద బసాకు 42 కేజీలు తూకం వేసి మిల్లుల వద్దకు పంపించినా, మిల్లర్లు అక్కడ మళ్లీ తాలు ఉందంటూ కొర్రీలు పెట్టి దిగుమతి చేసుకోవడం లేదు. వాస్తవానికి కొనుగోలు కేంద్రంలోనే అధికారులు ధాన్యాన్ని చెక్‌ చేసి, నిబంధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేసి మిల్లులకు పంపిస్తారు. అలా వెళ్లిన ధాన్యాన్ని దింపుకోకుండా ఆపడానికి, మిల్లర్లు అదనపు కోతలు విధించడానికి ఉన్న నిబంధనలేంటి? ఈ విషయంలో పట్టించుకునేవారు లేకుండాపోయారు.

మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలు!

అధికారులు మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైకి మిల్లర్లకు గట్టిగా చెబుతున్నామని కనిపిస్తున్నా, అధికారులు మిల్లర్లు చెప్పేదానికే తలాడిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే నెల రోజుల్లో 5 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే, 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేసి మిల్లులకు పంపితే, మిల్లర్లు తాము ధాన్యం దిగుమతి చేసుకున్నట్లుగా అకనాలెడ్జిమెంట్‌ ఇచ్చిన ధాన్యం 20 వేల మెట్రిక్‌ టన్నులకు మించకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి.

ఫ కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు

ఫ గందరగోళంగా ధాన్యం కొనుగోళ్లు

ఫ రైతుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి

ఫ తాజాగా కనగల్‌లో ఆత్మహత్యకు యత్నించిన కేంద్రం నిర్వాహకుడు

ఫ ఏటా ఏప్రిల్‌ చివరినాటికి సగానికిపైగా విక్రయం

ఫ ఈసారి సగం కొనుగోళ్లు కూడా పూర్తికాలే..

కనగల్‌ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు సైదులు మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించాడు. కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తే మిల్లర్లు దింపుకోకపోవడం, ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేస్తే పట్టించుకోలేదు. మిల్లర్ల వద్దకు రైతులే వెళ్లి మాట్లాడుకోమని చెప్పమని సూచన చేయడం, మరోవైపు రైతులు కొనుగోలు కేంద్రంలో ఎలా కొన్నారని, మిల్లులో ఎందుకు ఆపుతున్నారని ఒత్తిడి చేయడంతో తాను ఆత్మహత్యకు యత్నించినట్లు తాను రికార్డు చేసిన వీడియోలో పేర్కొన్నారు. దానిని బట్టే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, అధికారులు, మిల్లర్ల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement