333 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

333 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు

నల్లగొండ : విద్యా శాఖ మొదట నుంచీ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడం వల్లే జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 98.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో మొత్తం వివిధ కేటగిరీల కింద 448 హైస్కూళ్లు ఉంటే అందులో 333 పాఠశాలల్లో విద్యార్థులు పదిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన స్కూళ్లలో చాలా వరకు 90 శాతంపైనే ఉత్తీర్ణత సాధించారు.

విద్యార్థులను దత్తత తీసుకుని..

పాఠశాలల వారీగా హెడ్మాస్టర్ల చొరవతో సబ్జెక్టు టీచర్లతో కోఆర్డినేషన్‌ చేసుకుని విద్యార్థులను కొందరు ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. ప్రతి రోజు ఉదయం విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు వారి తల్లిదండ్రులకు వేకప్‌ కాల్‌ చేసి పిల్లలను నిద్ర లేపించి చదివించేలా కృషిచేశారు. ప్రత్యేక తరగతులకు సమయానికి హాజరయ్యేలా అవగాహన కల్పించారు. పాఠశాలకు వచ్చిన పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇదే క్రమంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రతి పాఠంపై స్లిప్‌ టెస్టు టెస్టులు నిర్వహించారు. రివిజన్‌ సందర్భంలో మోడల్‌ పేపర్లతో పరీక్షలు పెట్టి విద్యార్థుల్లో వార్షిక పరీక్షలంటే భయం తొలగించారు. వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాక పరీక్షకు పరీక్షకు మధ్యలో ఉన్న గ్యాప్‌లో ఆయా సబ్జెక్టు టీచర్లతో సందేహాలు నివృత్తి చేశారు. దాంతో పదిలో మెరుగైన ఫలితాలు సాధించగలిగారు.

ఫ రోజూ వేకప్‌ కాల్‌ చేసి

విద్యార్థులు చదివేలా కృషి

ఫ రెండుపూటలా ప్రత్యేక తరగతులు

ఫ పక్కా ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాల సాధన

హెడ్మాస్టర్లు, ఎంఈఓలు, సబ్జెక్టు టీచర్ల కృషితోనే పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాం. జిల్లాలో 488 హైస్కూళ్లు ఉంటే అందులో 333 స్కూళ్లు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా 98.48 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఈసారి పదో స్థానంలో నిలిచింది.

– భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement