ఫ రాష్ట్రంలోనే పదో స్థానంలో నల్లగొండ జిల్లా ఫ ఫలితాల్లో బాలికలదే పైచేయి
నల్లగొండ : పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 98.47 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా 10వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 11వ స్థానంలో ఉండగా.. ఈసారి 10వ స్థానానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 488 ఉన్నాయి. వీటి పరిధిలో 19,667 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 19,366 ఉత్తీర్ణత సాధించడంతో 98.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలదే పై చేయిగా నిలిచింది. బాలురు 10,131 మంది పరీక్ష రాయగా 9,949 ఉత్తీర్ణులై 98.20 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9,536 పరీక్ష రాయగా.. 9,417 మంది ఉత్తీర్ణులై 98.75 శాతం ఉత్తీర్ణత సాధించి బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు.
రీ కౌంటింగ్‌కు దరఖాస్తులు..
విద్యార్థులు మార్కులకు సంబంధించి రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 నుంచి మే 14 వరకు అవకాశం ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఆన్‌లైన్ bse.telangana.gov.in ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులు రీవెరిపికేషన్‌తో పాటు ఆన్సర్ బుక్ కావాల్సిన వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలని పేర్కొన్నారు. పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ జూన్ 5 నుంచి 12 వరకు ఉదయం నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆయా పాఠశాలల ద్వారా మే 14వ తేదీలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


