రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తాం
విస్తరణకు నోచుకోని రహదారితో ప్రమాదాలు
గుర్రంపోడు : నల్లగొండ – దేవరకొండ ప్రధాన రహదారి గుర్రంపోడు మండల పరిధిలో ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆరు నెలలుగా ప్రతి నెలా ఒకటి, రెండు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణం అంటేనే బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధానంగా గుర్రంపోడు నుంచి తానేదార్‌పల్లి స్టేజీ వరకు గల రోడ్డులోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వద్దిరెడ్డిగూడెం సమీపంలో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరద్‌చంద్ర పవార్ సూచిక బోర్డులు, చెట్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని సూచించారు. ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరైనా కంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అంటున్నారు.
వరుసగా జరిగిన ప్రమాదాలు ఇలా..
● జనవరి 26న ప్రధాన రహదారిపై చెట్టుకు కారు ఢీ కొన్న సంఘటనలో నేరడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కంబాల శ్రీను మృతిచెందాడు. ఇతనికి మరో ఇరవై రోజుల్లో పెళ్లి కావాల్సి ఉంది.
● మార్చి 30న తానేదార్‌పల్లి వద్ద ఆర్టీసీ బస్సును బైక్ ఢీ కొన్న ఘటనలో వడ్లపల్లి అంజిరెడ్డి మృతిచెందాడు
● ఏప్రిల్ 19న గుర్రంపోడులో శివారులో లారీ ఢీ కొని బైక్‌పై వెళ్తున్న తెరాటిగూడెం గ్రామానికి చెందిన శిరబోయిన శ్రీకాంత్ మృతిచెందాడు.
● ఏప్రిల్ 22న రోజుల క్రితం వద్దిరెడ్డిగూడెం గ్రామం వద్ద జరిగిన కారు– బైక్ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెంది మరో ముగ్గురు గాయపడ్డారు.
● డిసెంబర్ నెలలో మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం సభకు బందోబస్తుకు వెళ్లి వస్తూ పోలీసు వాహనం చెట్టుకు ఢీ కొన్న ఘటనలో పోలీసులు గాయపడ్డారు.
● గుర్రంపోడు శివారులోని ఇరుకై న బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి రెయిలింగ్ తక్కువ ఎత్తులో ఉన్నకారణంగా వెనుక కూర్చున మహిళ వాగులో పడి మృతిచెందింది.
ఫ ఈ రోడ్డంతా మూలమలుపులు,
గుంతలమయం
ఫ రోడ్డు వెంట చెట్లను ఢీకొనిమృత్యువాత పడుతున్న జనం
ఫ నిధులు మంజూరైనా..
మొదలుకాని విస్తరణ పనులు
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రేడియం స్టిక్కర్లు తెప్పించాం. వీటిని ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాం. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకన్న, ఎస్‌ఐ, గుర్రంపోడు
నల్లగొండ– దేవరకొండ రోడ్డు విస్తరణ ఇదిగో పులి– అదిగో తోక అన్న చందంగా మారింది. ఈ రహదారిపై గతంలో కంటే వాహనాల రద్దీ పెరిగింది. ఉదయం వేళలో వాహనాన్ని ఓవర్‌టేక్ చేయలేనంత రద్దీ ఉంటోంది. జిల్లాలో చాలా వరకు ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోగా ఈ రోడ్డు మాత్రం ఇంకా ఇరుకుగానే ఉంది. రెండేళ్ల క్రితం వరకు గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డులో ప్యాచ్ వర్క్ చేశారు. అక్కడక్కడా మాత్రమే మరమ్మతులు చేశారు. దీంతో రోడ్డంతా ఎగుడుదిగుడుగా, ప్రమాదకరంగా ఉంది. ఇక గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం క్రాస్ రోడ్డు నుంచి కట్టవారిగూడెం వరకు రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డుతో ప్రమాదాలకు రోడ్డు పక్కన దగ్గరగా ఉన్న పెద్ద వృక్షాలు కారణమవుతున్నాయి. ఇవి రోడ్డుకు దగ్గరగా ఉండటం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు తప్పించబోయి రోడ్డు పక్కకు వాహనం దింపితే చెట్టుకు ఢీ కొని ప్రమాదం జరుగుతోంది.


