నల్లగొండ : ప్రతినెల చివరి శనివారం వృద్ధులు, దివ్యాంగులకు నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవికాలం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ప్రజావాణి నిర్వహించే తేదీ ప్రకటించే వరకు వృద్ధులు, దివ్యాంగులు ప్రజావాణికి రావద్దని ఎండలో బయటకు రాకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి
డిండి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం డిండి మండల పరిధిలోని కందుకూర్, బొల్లనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు సక్రమంగా పెరిగేలా చూడాలన్నారు. బొల్లనపల్లి గ్రామశివారులో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కూలీలకు ఎలాంటి వసతులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకన్న, ఏపీఓ శ్రీనివాసులు, ఈసీ వెంకటాచారి, సర్పంచ్‌లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం ఆక్షాంక్షించారు. శుక్రవారం ఎంజీ యూనివర్సిటీలో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి మహనీయుల జీవితాలే సాక్ష్యమని వారి అడుగుజాడల్లో పయనించి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కళాకారుడు రేలారే ప్రసాద్ తన పాట, మాటలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ దేశాల భూపాల్, మహమ్మద్ అబ్దుల్ మాలిక్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, సరిత, అలువాల రవి, రవితేజ, వసంత, అరుణప్రియ, ప్రేమ్‌సాగర్, మద్దిలేటి, జ్యోతి, సబీనా హెరాల్డ్, హరీష్‌కుమార్, దోమల రమేష్, మిరియాల రమేష్ పాల్గొన్నారు.
వైభవంగా
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయబద్ధంగా ఊరేగించి ఆలయ ముఖ మండపంపై ఉత్తర దిశలో ఉన్న మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో పూజలు ముగిశాయి. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


