నల్లగొండ : జిల్లాలో అక్రమంగా ఇసుక, చెరువు మట్టి తవ్వకాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలించే వాహనాలను సీజ్ చేయాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి.. ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మట్టి తవ్వాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవసరమైన మేరకు ఇసుకను లీగల్‌గా అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అన్నేశ్వరమ్మగుట్ట చెరువు, కనగల్, తిమ్మాన్నగూడెం చెరువుల వద్ద అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వేములపల్లి మండలం బొమ్మకల్, రావులపెంటలో కొత్తగా 2 ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు మూడు రోజుల్లో నిరోదించేలా పోలీస్, రెవెన్యూ శాఖలు పని చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి లీగల్ విధానంపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజల అవసరాలకు ఇసుక సరఫరా చట్టబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మైనింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ అనుమతి లేకుండా రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేయాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


