నల్లగొండ : ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్‌లో గురువారం ఏఈఆర్వోలు, తహసీల్దార్లు, బీఎల్‌ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల మ్యాపింగ్‌లో వెనుకబడిన బీఎల్‌ఓలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి గ్రామస్తుల సహకారంతో ఫొటో మ్యాపింగ్ చేపట్టాలన్నారు. డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నట్లయితే వెంటనే ఫారం–7 ద్వారా తొలగింపు చేపట్టాలని స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాల్లో మ్యాపింగ్ పూర్తి కాని జాబితాను తీసుకుని బీఎల్‌ఓలు, బిల్ కలెక్టర్లు, ఆర్పీల సమన్వయంతో పని చేయాలని, సమస్యలు ఉంటే ఈఆర్‌ఓలకి తెలియజేయాలని, సాంకేతిక సమస్యలుంటే తహసీల్దార్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
దామరచర్లలో రైల్వే బైపాస్ లైన్
మిర్యాలగూడ : విష్ణుపురం– మోటుమర్రి రైల్వే మార్గాన్ని అనుసంధానం చేస్తూ దామరచర్ల వద్ద ఐదు కిలోమీటర్ల రైల్వే బైపాస్ లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దీనికి నెల రోజుల క్రితం రైల్వే శాఖ మార్కింగ్ నిర్వహించగా ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే జరిపి భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. 4.90కిలోమీటర్ల మార్గానికి 52 ఎకరాల భూమిని సేకరించారు. 60 మంది రైతులకు సంబంధించిన వివరాలు గెజిట్‌లో పొందుపరిచారు. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు విధించారు. ఈ లైన్ విష్ణుపురం స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో దామరచర్ల విద్యుత్ ఉపకేంద్రం పక్క నుంచి నాగులచెర్వు దిగువ నుంచి మోటుమర్రి రైల్వే లైన్‌కు అనుసంధానం చేస్తారు. నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై ఆర్‌యుబీ(వంతెన కింద రహదారి) నిర్మించనుంది. నాలుగు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు.
ఎస్‌పీఎఫ్ ఆధ్వర్యంలో హరితహారం
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్‌పీఎఫ్ (ప్రత్యేక రక్షణ దళం) ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాపాలన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పైలాన్‌కాలనీ జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డ్యాం ఎస్‌పీఎఫ్ కమాండెంట్ విజయభాస్కర్‌రావు, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌నాయుడు, శ్రీనివాస్‌రావు, చీప్ ఇంజనీర్ మంగేష్‌కుమార్ పాల్గొన్నారు.
కూలీలకు మౌలిక వసతులను కల్పించాలి
మిర్యాలగూడ, అడవిదేవులపల్లి : ఉపాధి హామీ కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం, కొండ్రపోల్, అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయిపాలెం, అడవిదేవులపల్లి గ్రామాల్లో ఉపాది హామీ పనులను, నర్సరీలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. ఉపాది కూలీలు పనిచేసే చోట టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉదయం 6గంటల నుంచి 11గంటల వరకు పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు అలివేలు మంగమ్మ, మెసిన్ బిన్ అహ్మద్, తహసీల్దార్ రాగ్యానాయక్, ఏపీఓ నాగేశ్వర్‌రావు, ఏపీఎం కృష్ణమూర్తి, తాళ్లవీరప్పగూడెం సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు, ఈసీ శంకర్, టీఏ సైదా, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


