నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని.. అప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. పంట మార్పిడిపై జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ సీజన్‌కు ముందే ఆయా డివిజన్ల వారీగా రైతు సదస్సులను నిర్వహించాలన్నారు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం తర్వాత యూనిఫాం ఇచ్చేందుకుగాను జిల్లా విద్యా, గ్రామీణాభివృద్ధి శాఖలు ముందే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించాలని సూచించారు. బిహార్ రాష్ట్రంలో ‘మఖాన’ పంటను అధిక మొత్తంలో పండిస్తున్నారని, మన రైతులు ఈ పంటను సాగు చేసే విధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ మఖాన పంట సాగు పద్ధతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ నీటిని ఎవరైనా ఇతర అవసరాలకు వాడితే.. జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ప్రత్యేక కలెక్టర్ నటరాజ్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి