
తల్లిదండ్రులు, సోదరితో ధీరజ్‌రెడ్డి
తిరుమలగిరి(నాగార్జునసాగర్): సివిల్స్ సాధించాలన్న తల్లిదండ్రుల కలలను నెరవేర్చడానికి ఆ యువకుడు అహర్నిశలు కష్టపడి చదివాడు. మూడు సార్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా నాలుగోసారి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. అతనే నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం అల్వాలకు చెందిన పెంకీసు ధీరజ్ రెడ్డి. మంగళవారం ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 173వ ర్యాంక్ సాధించాడు. పెంకీసు సత్యనారాయణ, హేమలత దంపతుల కుమారుడైన ధీరజ్‌రెడ్డి ప్రాథమికోన్నత విద్యాభ్యాసం నల్లగొండలో, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లో కొనసాగింది.
ప్రజాసేవ చేయాలని..
ధీరజ్ తండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, తల్లి స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో అతడిని సివిల్స్‌వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించారు. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటూ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 2019, 2021, 2022లో మూడు పర్యాయాలు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా అతడు వెనకడుగు వేయలేదు. సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. నాలుగో ప్రయత్నంలో విజయం ఆయన సొంతమైంది.
విద్యను ఆస్తిగా ఇవ్వాలి
– సత్యనారాయణరెడ్డి, ధీరజ్‌రెడ్డి తండ్రి
తల్లిదండ్రులు పిల్లలకు విద్యను ఆస్తిగా ఇవ్వాలి. చదువు అనేది చాలా విలువైనది. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లభించినప్పుడే ఏదైనా సాధించగలను అనే నమ్మకం వారిలో కలుగుతుంది.
ఫ యూపీఎస్సీ ఫలితాల్లో 173వ
ర్యాంకు సాధించిన అల్వాల వాసి
ఫ నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయిన ధీరజ్‌రెడ్డి
ఫ తల్లిదండ్రుల కల నెరవేర్చిన
యువకుడు