
నల్లగొండలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్లగొండ టౌన్, నకిరేకల్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించడమే.. సీపీఎం ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం పేర్కొన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర సోమవారం నల్లగొండ, నకిరేకల్ ప్రాంతాల్లో సాగింది. నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం జనచైతన్య యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల తమ్మినేని మాట్లాడారు. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దేశ రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనసరిస్తున్న మతోన్మాద, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర చేపట్టామన్నారు. వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు కలిసి రాబోయే కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక మహా సంఘటనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే పనిలో ఉందని విమర్శించారు. బీజేపీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అవసరం లేదని, వారికి కేవలం కార్పొరేట్‌లు, పెట్టుబడిదారులు కావాలని వ్యాఖ్యానించారు. రాబేయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడాని సీపీఎం, సీపీఐలు నిర్ణయించాయని.. సీట్ల విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదని చెప్పారు. నల్లగొండ గతంలో సీపీఎం గెలిచిన సీట్లను అడుగుతామని.. నకిరేకల్‌లో గతంలో ఆరు సార్లు గెలిచామని.. ఈ సీటు కూడా కావాలని అడుగుతామని.. ఒకవేళ కేటాయిస్తే మమ్ముల్ని గెలిపించాలని.. వారికి కేటాయిస్తే ఎర్రజెడా ముందుండి వారి గెలుపునకు సహకరిస్తుందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, యాత్ర కన్వీనర్ పోతినేని సుదర్శన్‌రావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, తుమ్మల వీరారెడ్డి, కందాల ప్రమీళ, డబ్బికార్ మల్లేష్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్‌హాషం, చినపాక లక్ష్మీనారాయణ, ప్రభావతి, సలీం తదితరులు పాల్గొన్నారు.
బీజేపీని కట్టడి చేయాలి : కంచర్ల
మతోన్మాదశక్తుల ద్వారా దేశాన్ని భ్రష్టుపట్టించే చర్యలకు బీజేపీ పాల్పడుతుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. సీపీఎం జన చైతన్య యాత్రకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ఈడీ, మోదీలకు బీఆర్‌ఎస్ భయపడబోదన్నారు. బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కూకటి వేళ్లతో కూల్చాలి : చిరుమర్తి
వ్యాపార శక్తులకు కొమ్ముకాస్తున్న మతోన్మాద బీజేపీని కూకటి వేళ్లతో కూల్చాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో జనచైతన్య యాత్రకు ఆయన సంఘీబావం తెలిపి మాట్లాడారు. సీపీఎం, సీపీఐలో కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నందును మేము కూడా ప్రజా సమస్యలపై కలిసి పని చేస్తామన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఫ నల్లగొండ, నకిరేకల్‌లో జనచైతన్య యాత్ర

నకిరేకల్‌లో సాగుతున్న జనచైతన్య యాత్ర
