
మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తాం
కనగల్ : మూడు సంవత్సరాల్లో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం కనగల్ మండలం జి.యడవల్లిలో రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న చెరువు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రూ.4000 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు చేపట్టామని.. అటువైపు నుంచి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయాయన్నారు. పనులను తిరిగి ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. జి.యడవల్లి గ్రామంలో రూ.4 కోట్ల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. రూ.5 కోట్లతో బీబీ రోడ్లు, రూ.30 లక్షలతో డ్రెయినేజీ మంజూరు చేశామన్నారు. కనగల్ పీహెచ్‌సీలో గ్లూకోమా కంటి పరీక్షల కోసం అధునాతన యంత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉదయసముద్రం, బ్రాహ్మణ వెల్లెంల తదితర ప్రాజెక్టుల ద్వారా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జి.యడవల్లి చెరువు తూము గండి వల్ల నీరు వృథా అవుతతోందని తెలుసుకుని మంత్రి ఆదేశాలతో నిధులు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నల్లగొండ ఆర్డిఓ వై.అశోక్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, తహసీల్దార్ పద్మ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి