
పీఏసీఎస్‌లలో బదిలీల ప్రక్రియ
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని 107 సహకార సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న సీఈఓల బదిలీలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సహకార వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు 44 జీఓను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు మించి ఒకేచోట పనిచేస్తున్న సీఈఓలను బదిలీ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పలువురు సీఈఓలు దీర్ఘకాలికంగా సంఘాల్లో విధులు నిర్వహిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సంఘాలను ఆర్థికంగా దివాళా తీయిస్తున్నారనే అపవాదు ఉంది. ప్రస్తుత చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే దీర్ఘకాలికంగా సంఘాల్లో ఉద్యోగాలు చేస్తున్న సీఈఓలను బదిలీ చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్ర సహకార వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుపై ఒత్తిడి తెచ్చి బదిలీల ప్రక్రియకు ఉత్తర్వులను జారీ చేయించారు. త్వరలో జిల్లాస్థాయి ఎన్‌పవర్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సంఘాల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీఈఓలను బదిలీ చేయనున్నారు.
ఫ సొసైటీల సీఈఓలకు త్వరలో స్థానచలనం
పారదర్శకంగా బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్ 44 ప్రకారం జిల్లా ఎన్‌పవర్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో సంఘాల సీఈఓల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తాం. సీఈఓలు దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తుండటం వల్ల సంఘాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. బదిలీల వల్ల సంఘాలు బలోపేతమయ్యే అవకాశం ఉంది.
– కుంభం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్