వానాకాలం సాగుకు సన్నద్ధం
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ధాన్యం అమ్మకాలను పూర్తి చేసుకున్న అన్నదాతలు, చెలకల్లో పత్తి కట్టెలను తొలగించిన రైతులు దుక్కులు దున్నుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నెల 27 వరకు నైరుతి రుతుపననాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ సారి జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ఈ నెల 25న రోహిణి కార్తే, జూన్ 5వ తేదీ నుంచి మృగశిర కార్తే ఆరంభమై వర్షాలు కురవగానే వరినార్లు పోసుకోవడంతో పాటుగా పత్తి విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అందుబాటులో విత్తనాలు
వానాకాలం సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలు 3,120 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. జిల్లాలో 33 మండలాల్లోని ప్రాథమిక సహకార సంఘాలు, అగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు ఉన్నాయి. వీటిని రైతులకు 50 శాతం సబ్సిడీపై అందిస్తోంది. దీంతో పాటు వరి, పత్తి విత్తనాలు కూడా ప్రైవేటు విత్తన దుకాణాదారుల వద్ద అందుబాటులో ఉన్నాయి.
3,66,869 మెట్రిక్ టన్నుల ఎరువులు
వానాకాలం సీజన్‌కు 3,66,869 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 1,44,802 మెట్రిక్ టన్నుల యూరియా, 61,343 మెట్రిక్ టన్నుల డీఏపీ, 33,758 ఎంఓపీ, 1,14,043 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 12,923 మెట్రిక్ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు అవసరంగా గుర్తించారు. ఇప్పటికే సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.
దుక్కులను దున్నుతున్న రైతులు
ఫ దుక్కులు దున్నుతున్న రైతులు
ఫ 11.60 లక్షల ఎకరాల్లో
సాగు కానున్న పంటలు
ఫ అందుబాటులో జనుము, జీలుగ, వరి, పత్తి విత్తనాలు
ఫ 3,66,869 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా
ఫ జూన్ మొదటి వారంలో వరినారు పోసుకునే అవకాశం
వానాకాలం సాగు అంచనా ఇలా.. (ఎకరాల్లో)
పత్తి 5,47,735 వరి 5,25,350 కంది 10,000
సజ్జ 200 జొన్న 500 మొక్కజొన్న 500
ఆముదం 500 పెసర 1200 వేరుశనగ 1500
ఇతర పంటలు 72,904 మొత్తం 11,60,389
ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశాం
వానాకాలం సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ముందస్తుగానే విత్తనాలు, ఎరువులు అంచనాలకు తగ్గట్లుగా సిద్ధం చేస్తున్నాం. నకిలీ విత్తనాల అమ్మకంపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. రైతులు విధిగా నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి రశీదును తీసుకోవాలి.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ


