98శాతం పూర్తి..
● పది రోజులుగా చౌకధర
దుకాణాల మూత
● మూడు నెలల రేషన్ బియ్యం
అందక లబ్ధిదారుల ఆందోళన
కల్వకుర్తి రూరల్: మూడు నెలల రేషన్ బియ్యం తీసుకునేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటం.. చాలా వరకు చౌకధర దుకాణాలు మూతపడి కనిపిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతినెలా మొదటి తేదీలోపే రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. ఈ నెల మాత్రం 5వ తేదీ తర్వాతే కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌లోని 132 షాపులకు బియ్యం సరఫరా జరిగింది. ఆ వెంటనే వినియోగదారులు రేషన్ షాపుల వద్ద క్యూ కట్టి బియ్యం తీసుకున్నారు. కొన్ని రోజులకే రేషన్ దుకాణాల్లో బియ్యం అయిపోవడం.. మళ్లీ సరఫరా కాకపోవడంతో మూతపడ్డాయి. పది రోజులుగా షాపులన్నీ మూసి కనిపిస్తుండటంతో బియ్యం తీసుకోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 98శాతం రేషన్ బియ్యం పంపిణీ పూర్తి చేశాం. ఈ నెల 31వ తేదీ నాటికి లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంది. చౌకధర దుకాణాల్లో బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
– రాజేందర్, డీఎం, సివిల్ సప్లయ్‌శాఖ
జిల్లాలో 558 చౌకధర దుకాణాలు..
జిల్లావ్యాప్తంగా 558 రేషన్ దుకాణాలు ఉండగా.. అత్యధికంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 132 దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాలకు 35వేల క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 30వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. మరో 5వేల క్వింటాళ్లు ఆదివారం నాటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కల్వకుర్తిలో లబ్ధిదారుల తాకిడి ఎక్కువగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్లు శనివారం గోదాం ఇన్‌చార్జి శశిధర్‌రావును కలిసి బియ్యం సరఫరా చేయాలని విజ్ఞిప్తి చేశారు. బియ్యం లేకపోవడంతో వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే గడువులోగా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తేనే మిగిలిన లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంది.


