అచ్చంపేట రూరల్: అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 24.50కోట్లతో మద్దిమడుగు ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో రూ. 15 కోట్లు హరిత హోటల్‌కు మంజూరు చేశారన్నారు. సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు రూ. 100కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. మొదటి విడతలో రూ. 36కోట్లు మంజూరయ్యాయని.. త్వరలోనే జీఓ రానుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మద్దిమడుగు ప్రాంతానికి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదే విధంగా పదర, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాల్లో రాజీవ్ మినీ స్టేడియాల ఏర్పాటు కోసం రూ. 2కోట్ల చొప్పున మంజూరయ్యాయని పేర్కొన్నారు. అచ్చంపేటలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియానికి రూ. 8.50కోట్లు మంజూరు కాగా.. మరో రూ.6కోట్లు మంజూరు కానున్నాయని తెలిపారు. ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే వైఎస్సార్ పార్కు కోసం రూ. 4కోట్లు మంజూరైనట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
క్రీడలు జీవితంలో
భాగం కావాలి
నాగర్‌కర్నూల్: క్రీడలు జీవితంలో భాగం కావాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో క్రీడా పోటీల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో మానసిక, శారీరక వికాసం పెంపొందుతాయని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, డీవైఎస్‌ఓ సీతారామ్, డీఈఓ రమేశ్‌కుమార్, డీఐఈఓ వెంకటరమణ, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.


