గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్‌లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్‌లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి.
రబీలోనే కష్టాలు..
వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్‌లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది.
ప్రత్యామ్నాయ మార్గాలపై..
కృష్ణాబేసిన్‌లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయడం ఏటా సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ప్రాజెక్టులకు వరద నీటిని ఎత్తిపోస్తూ నింపుతున్నప్పటికీ మరోవైపు వేల టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుంది. వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నా.. మరోవైపు రబీ సీజన్‌లో ప్రాజెక్టులలో నీరులేక వెలవెలబోతూ ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు, వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు పూర్తి చేశారు.
రివర్స్ పంపింగ్ విధానం..
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయించారు. అలాగే జూరాలకు వరదల సమయంలో రోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజుల పాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తి పోస్తుండడంతో కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే రబీ సీజన్‌లో రివర్స్ పంపింగ్ విధానంతో గుడ్డెందొడ్డి జలాశయం నుంచి జూరాల జలయశంలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తే సాగునీటి కష్టాలు తొలగనున్నాయి.
రూ.6 వేల కోట్లతో..
గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 1,400 ఎకరాలలో నిర్మించగా.. 15 టీఎంసీలకు పెంచే క్రమంలో అదనంగా సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు నూతనంగా నిర్మించే రిజర్వాయర్‌ను విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్‌కు నింపిన నీటిని తిరిగి జూరాలకు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండటం రాష్ట్రంలోనే తొలిసారి.
ఉమ్మడి జిల్లాలో..
కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్‌సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది.
తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు
1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు
వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు
రబీ సీజన్‌లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత
సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక


